Let's talk: editor@tmv.in
ఓటరు నమోదు పూర్తి చేయండి.. కాంగ్రెస్‌ బీఎల్‌ఏలకు సమన్వయ కమిటీ పిలుపు

ఓటరు నమోదు పూర్తి చేయండి.. కాంగ్రెస్‌ బీఎల్‌ఏలకు సమన్వయ కమిటీ పిలుపు

Gaddamidi Naveen
30 జులై, 2026

తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్ఏ) కృషిని తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ అభినందించింది. మిగిలి ఉన్న అర్హులైన ఓటర్లందరి నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పిలుపునిచ్చింది.

న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.

సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ బీఎల్ఏల పనితీరును సమీక్షించినట్లు తెలిపారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పునాది అయిన పౌరులందరి ఓటు హక్కును రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని, మిగిలిన నమోదు ప్రక్రియను కూడా త్వరలోనే పూర్తి చేయాలని మీనాక్షి నటరాజన్ సూచించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.

త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు, అభ్యర్థుల ఎంపిక మార్గదర్శకాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నాయకులతో సంప్రదింపులు జరిపి ముగ్గురు అభ్యర్థుల ప్యానెల్‌ను పార్టీ అధిష్టానానికి సమర్పిస్తారని చెప్పారు. కాగా, ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 3వ తేదీ వరకు బీఎల్ఓలు ఇళ్లను సందర్శించి వివరాలు సేకరిస్తారని, ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారని తెలిపారు.

ట్యాగ్‌లు
TelanganaCongressRevanthReddyBhattiVikramarkaVoterEnrollmentSIRElectoralRollElectionCommissionDemocracy
ఓటరు నమోదు పూర్తి చేయండి.. కాంగ్రెస్‌ బీఎల్‌ఏలకు సమన్వయ కమిటీ పిలుపు - Tholi Paluku