
ఓటరు జాబితాలో పేర్లు తొలగింపుపై మమతా బెనర్జీ ధర్నా!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (పోస్టు-సర్)ఓటరు జాబితాలలో అనుమానాస్పదంగా కొన్ని పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ శుక్రవారం కోల్‌కతాలోని ధర్మతలలో భారీ నిరసన కార్యక్రమం (ధర్నా) చేపట్టారు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేస్తోందని, "సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్" (నిశ్శబ్ద రిగ్గింగ్) ద్వారా ఓటర్ల హక్కులను కాలరాస్తోందని తీవ్రంగా విమర్శించారు.
టిఎంసీ జాతీయ జనరల్ సెక్రటరీ అబిషేక్ బెనర్జీ దీనిపై స్పందిస్తూ, ఎన్నికల సంఘం "రాజకీయ ప్రేరిత" చర్యలు చేపడుతోందని ఆరోపించారు, దీని ద్వారా లక్షల మంది న్యాయసమ్మత ఓటర్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా నుండి తొలగించారని చెప్పారు.
ముఖ్యంగా మైనార్టీ, మైగ్రంట్ వర్కర్స్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలపై ఈ డీలిషన్‌లు అన్యాయంగా ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు. అబిషేక్ బెనర్జీ ఎన్నికల సంఘంపై మాటల దాడి కొనసాగిస్తూ, "ఒక కోటికి పైగా ఓటర్లను తొలగించాలన్న లక్ష్యం ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు నిర్ణయించబడింది" అని తెలిపారు.
మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్ ప్రక్రియ అత్యంత లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. బ్రతికున్న వ్యక్తులను చనిపోయినట్లుగా రికార్డుల్లో చూపిస్తూ ఓటర్ల జాబితా నుండి వేలాది మంది పేర్లను తొలగిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, వలస కార్మికులు, దినసరి కూలీలను లక్ష్యంగా చేసుకుని ఈ తొలగింపులు జరుగుతున్నాయని, ఇది బెంగాల్ వ్యతిరేక కుట్రలో భాగమని ఆమె పేర్కొన్నారు. గతంలో ఢిల్లీలో బాధితులను కలిసినప్పుడు వారు చెప్పిన గాథలు తనను కలచివేసాయంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.
ఎన్నికల సంఘం ఎన్నడూ లేని విధంగా బెంగాల్‌లో భారీ సంఖ్యలో మైక్రో-అబ్సర్వర్లను నియమించడాన్ని ఆమె తప్పుబట్టారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారుల అధికారాలను అపహరించేలా ఈ నియామకాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన "అమానవీయ చర్యలకు" పాల్పడుతోందని ఆమె విమర్శించారు.
ఎన్నికల కమిషన్‌తో విభేదాలు
ఇటీవల ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన భేటీ గురించి ప్రస్తావిస్తూ ఆ భేటీలో తనను అవమానించారని మమతా బెనర్జీ ఆరోపించారు. అయితే, దీనిపై ఎన్నికల కమిషన్ వర్గాలు స్పందిస్తూ, సర్ ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతుందని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, బెంగాల్ ప్రజల గౌరవం కోసం తమ పోరాటం ఆగేది లేదని మమతా బెనర్జీ ప్రకటించారు.
ఇక ఎన్నికల సంఘం ఇటీవల ప్రచురించిన పోస్టు-సర్ ఓటరు జాబితా ప్రకారం, సుమారు 63.66 లక్షల మంది (8.3%) డిలీట్ చేయబడ్డారని, ఓటరు సంఖ్య 7.66 కోట్ల నుండి 7.04 కోట్ల వరకు తగ్గిందని అధికారికంగా వెల్లడించింది. అదనంగా 60.06 లక్షల మంది "అడ్జుడికేషన్ కింద" ఉన్నారని, వేర్వేరు న్యాయపరమైన సమీక్షల తర్వాత మాత్రమే ఓటరుగా వారి అర్హత నిర్ధారించబడనుందని పేర్కొంది.
ప్రభుత్వం మారబోతోందన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
ఈ నిరసనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, “మమతా బెనర్జీకి ఏ సమాధానం ఇవ్వాలి? ఇది అబద్ధాల గూడెం. ఇక్కడ అభివృద్ధి పూర్తిగా ఆపేశారు. రహదారులు నిర్మించడానికి అనుమతించడం లేదు. చొరబాటుదారులను అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి కూడా స్థలం ఇవ్వడం లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోంది” అని అన్నారు.
అంతేకాదు, “మమతా బెనర్జీ చేస్తున్న నిరసన కేవలం ముస్లిం చొరబాటుదారులను కాపాడటానికి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడానికి మాత్రమే. మమతా బెనర్జీ దీనిపై సిగ్గుపడాలి. అక్కడి అధికారులకు, గూండాలకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను - ప్రభుత్వం మారబోతోంది” అని అన్నారు.
