Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

ఐపీఎల్ 19వ సీజన్ (2026) రసవత్తరంగా సాగేందుకు సిద్ధమవుతున్న వేళ, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ సరికొత్త జెర్సీని శుక్రవారం అట్టహాసంగా ఆవిష్కరించింది. ముంబై నగర ఉత్సాహానికి ప్రతీకగా గాఢమైన నీలి రంగు, జట్టు సాధించిన అపూర్వ విజయాలు, వారసత్వానికి చిహ్నంగా మెరిసే బంగారు వర్ణం కలగలిపి ఈ జెర్సీని రూపొందించారు. జట్టులోని క్రీడాకారుల మనస్తత్వం, పట్టుదల, ఆటలో కొనసాగించాల్సిన వేగం వంటి మూడు ముఖ్యాంశాలకు ప్రాధాన్యతనిస్తూ జెర్సీపై 'ఎమ్ M' అక్షరంతో కూడిన ప్రత్యేక డిజైన్లను పొందుపరిచారు.

పాత జ్ఞాపకాల పునరావృతం

ఈ కొత్త జెర్సీ ప్రచార చిత్రాల్లో జట్టు కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు మెరిశారు. ఈ జెర్సీ డిజైన్ ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర సాగించిన 2020 సీజన్ నాటి కిట్‌ను తలపిస్తోందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ప్రోమో పోస్టర్‌లో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కనిపించకపోవడం పట్ల కొందరు అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు విదేశీ విమానయాన సంస్థ స్పాన్సర్‌గా ఉండటంపై చర్చించుకుంటున్నారు.

కొత్త స్పాన్సర్లు.. ప్రీ-ఆర్డర్ల హడావుడి

ఈసారి ముంబై జెర్సీపై సరికొత్త బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. లారిట్జ్ క్నుడ్సెన్, మలేషియా ఎయిర్‌లైన్స్, ఓక్ స్మిత్ ఐజన్ సైకిల్స్, మరియు స్కెచర్స్ వంటి ప్రముఖ సంస్థలు స్పాన్సర్లుగా చేరాయి. ఐపీఎల్ వేలానికి ముందే ఈ జెర్సీపై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ జెర్సీకి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవ్వగా, ధరను రూ. 2,499గా నిర్ణయించారు. ఈ కొత్త హంగులతో ముంబై ఇండియన్స్ ఈసారి ఐపీఎల్ బరిలో ఎంతవరకు రాణిస్తుందో చూడాలి.

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ ఆవిష్కరణ - Tholi Paluku