
ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతం
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకోవడంతో సోమవారం నిరసనను మరింత ఉధృతం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు, ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లను బహిష్కరించారు. దీంతో వైద్య సేవలపై ప్రభావం పడింది. ముఖ్యంగా ప్రసూతి, చిన్నారుల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడకుండా సీనియర్ వైద్యులు, అసిస్టెంట్ సర్జన్లను అధికారులు అందుబాటులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. 2026 జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌ను 30 శాతం పెంచాలని, సీనియర్ వైద్యుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం ఎంఎస్సీ, పీహెచ్డీ అభ్యర్థులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించే ప్రతిపాదనపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. స్టైపెండ్ పెంపుపై జనవరి నుంచే ప్రభుత్వానికి లేఖలు పంపుతున్నప్పటికీ స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూనియర్ డాక్టర్లు తెలిపారు. పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచితే కొత్తగా పీజీ పూర్తి చేసిన వైద్యులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్), ఆంధ్రా మెడికల్ కాలేజీ యాజమాన్యాలు అత్యవసర వైద్య సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాయి. ఓపీ, అత్యవసర సేవలు, ప్రసూతి, చిన్నారుల విభాగాలు, ఐసీయూలు, వెంటిలేటర్ సేవలకు సీనియర్ వైద్యులను కేటాయించారు. డీఎంహెచ్‌వో నుంచి కూడా కొంతమంది వైద్యులను రప్పించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమరావతిలో రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులతో మూడుసార్లు సమావేశమైనా అర్థవంతమైన చర్చలు జరగలేదని ఏపీ జూడా ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రితో అర్థవంతమైన చర్చలు జరపాలని కోరారు. కాగా, జూనియర్ డాక్టర్ల ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శితో సమావేశం కానుంది. తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం వచ్చే వరకు అత్యవసర సేవల బహిష్కరణ కొనసాగుతుందని ఏపీజూడా స్పష్టం చేసింది.
