Let's talk: editor@tmv.in
ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

ఏపీలో క్షీణించిన శాంతిభద్రతలపై లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి వాయిదా తీర్మానం

Gaddamidi Naveen
21 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రంగా క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై అత్యవసర చర్చ చేపట్టాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యుడు మద్దిల గురుమూర్తి సోమవారం పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసుల అతిగా ప్రవర్తించడం, మహిళలపై నేరాలు, షెడ్యూల్డ్ కులాలపై దాడులు, రాజకీయ హింస, పౌర హక్కుల ఉల్లంఘనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, అందువల్ల దీనిపై తక్షణమే చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు.

రాష్ట్రంలో పోలీసు వేధింపుల కారణంగా ఇటీవల సంభవించిన మరణాలను ఎంపీ గురుమూర్తి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కృష్ణా జిల్లాలో సాయికృష్ణ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఏడుకొండలు లాకప్ డెత్ కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కర్నూలులో మాల గంగమ్మ, కృష్ణా జిల్లాలో క్రాంతి కుమార్, పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుస్సేన్ మరణాలను ఆయన ఉదహరించారు. పోలీసుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దరియా హుస్సేన్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైందని, ఈ సంఘటనలు కస్టోడియల్ భద్రత, పోలీసుల జవాబుదారీతనంపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని అన్నారు.

నేరాల సంఖ్యను లెక్కలతో సహా వివరించిన ఎంపీ

రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న అరాచకాలకు సంబంధించి ఎంపీ గురుమూర్తి లోక్‌సభకు సమగ్ర నివేదికను అందించారు. జూన్ 2024 నుంచి మార్చి 2026 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై 209 నేరాలు నమోదయ్యాయి. వీటిలో 126 అత్యాచారం, లైంగిక దాడి కేసులు, 12 అత్యాచార యత్నాలు, 35 లైంగిక వేధింపుల కేసులు, 97 భౌతిక దాడులు, 34 హత్యలు లేదా అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. వేధింపుల భరించలేక 15 మంది ఆత్మహత్య నమోదయ్యాయని వివరించారు.

అదే కాలంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారిపై 69 ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటిలో హత్యలు, కస్టడీ హింస, పోలీసుల వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేతలు, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన నేరాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 133 రాజకీయ హింస ఘటనలు నమోదయ్యాయని, వాటిలో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 అపహరణలు, 58 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంసం ఘటనలు, రాజకీయ వేధింపుల కారణంగా జరిగినట్లు ఆరోపణలున్న 4 ఆత్మహత్యలు ఉన్నాయని గురుమూర్తి తెలిపారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం పోలీసుల పనితీరుపై 12 సార్లు ప్రతికూల వ్యాఖ్యలు చేసిందని ఎంపీ గుర్తుచేశారు. అదనంగా 79 శాంతిభద్రతల ఉల్లంఘన ఘటనలు నమోదయ్యాయని, ఇవన్నీ రాష్ట్రంలో పాలన, పౌర హక్కుల సంపూర్ణ విచ్ఛిన్నానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఈ వాయిదా తీర్మానం ద్వారా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తక్షణమే సమగ్ర నివేదికను కోరాలని, నమోదైన అన్ని సంఘటనలపై నిష్పక్షపాతంగా, నిర్దిష్ట గడువులోగా దర్యాప్తు జరిపించాలని కోరారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, జవాబుదారీతనాన్ని నిర్ధారించాలని అలాగే రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలనను పునరుద్ధరించి, ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను కాపాడాలని ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు
AndhraPradeshAPPoliticsYSRCPLokSabhaLawAndOrderParliamentBreakingNewsPoliticalNewsIndiaNewsAPNews