
ఏపీలో అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కులు: మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్‌లో డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి అంతర్జాతీయ స్థాయి థీమ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి. రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. గుంటూరు జిల్లా కర్నూలుతల గ్రామ పరిధిలో గ్రామంలోని 171 ఎకరాల్లో భారీ వినోద పార్కు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు.
ఇటువంటి భారీ ప్రాజెక్టులు చేపట్టాలంటే దాదాపు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి అవసరమవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పెద్ద పార్కులు ప్రైవేట్ సంస్థలే నిర్మిస్తాయని ప్రభుత్వం కేవలం భూమి కేటాయింపు, అనుమతులు ఇవ్వడం రాయితీలు కల్పించడం వంటి సహకారాన్ని మాత్రమే అందిస్తుందని స్పష్టం చేశారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో పర్యాటకుల రాక ఎక్కువగా ఉండటం వల్లే అక్కడ ఇలాంటి పార్కులు విజయవంతమయ్యాయని ఆయన గుర్తు చేశారు.
అదేవిధంగా మన దేశంలో పర్యాటకుల ఖర్చు చేసే సామర్థ్యం ఇంకా తక్కువగానే ఉండటం ఈ భారీ ప్రాజెక్టులకు ఒక సవాల్‌గా మారిందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్‌లో ఒక పర్యాటకుడు సగటున రూ. 21 వేల వరకు మాత్రమే ఖర్చు చేస్తున్నారని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఇది తక్కువని మంత్రి పేర్కొన్నారు. పర్యాటకుల సంఖ్యతో పాటు వారు ఖర్చు చేసే స్తోమత కూడా పెరిగితేనే విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని ఆయన తెలిపారు.
అయితే దేశీయంగా పేరున్న అమ్యూజ్‌మెంట్ పార్క్ సంస్థలైన ఇమేజికా, వండర్లా వంటి వాటితో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని మంత్రి వెల్లడించారు. ఈ సంస్థలు ముఖ్యంగా విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. పర్యాటక రంగానికి 'పరిశ్రమ' హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలు అందిస్తోందని, దీనివల్ల పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా ఇటీవల విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పర్యాటక శాఖ సుమారు రూ. 18,448 కోట్ల విలువైన 102 ఒప్పందాలు కుదుర్చుకుందని అందులో మూడు థీమ్ పార్క్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని రాష్ట్రంలో ఇలాంటి పార్కులు వస్తే పర్యాటకం అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
