
ఏపీలో 50 శాతం పచ్చదనం సాధిస్తాం: నాగబాబు
రాష్ట్రంలో అటవీ, వృక్ష సంపదను విస్తరించి 2047 నాటికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం పచ్చదనాన్ని సాధించడమే లక్ష్యం అని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజలందరి భాగస్వామ్యంతో మహోద్యమంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. శుక్రవారం మంగళగిరి అరణ్యభవన్‌లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాగబాబు మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ గ్రీన్ సొసైటీ నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు.
ఆరోగ్యకరమైన పర్యావరణం అందిస్తాం
ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతం ఉందని నాగబాబు తెలిపారు. 2047 నాటికి అటవీ, వృక్ష సంపదను కలిపి పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణం, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ఈ లక్ష్యం వెనుక ఉద్దేశమన్నారు. వ్యవసాయ భూములు, గ్రామాలు, పట్టణాలు, ప్రధాన రహదారుల ఇరువైపులా, కాలువ గట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలు, పరిశ్రమల పరిసరాలు, అనుకూలమైన బంజరు భూముల్లో విస్తృతంగా పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, తోటల అభివృద్ధిని ప్రోత్సహిస్తామన్నారు.
అన్ని శాఖల సమన్వయంతో..
50 శాతం పచ్చదనం లక్ష్యాన్ని సాధించడం ఒక్క శాఖతో సాధ్యం కాదని నాగబాబు పేర్కొన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, పంచాయతీరాజ్, విద్య, పరిశ్రమలు, రెవెన్యూ, జలవనరులు, రవాణా, అటవీ తదితర శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపడతామని తెలిపారు. రైతులు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత, పారిశ్రామికవేత్తలు, ప్రతి పౌరుడిని ఏపీ-గ్రీన్ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామన్నారు. దీనిని ప్రభుత్వ పథకంగా కాకుండా ప్రజలందరూ భాగస్వామ్యమయ్యే ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. మొక్కలు నాటడం మాత్రమే తమ లక్ష్యం కాదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి బతికించడమే అసలైన బాధ్యత అని నాగబాబు స్పష్టం చేశారు. నాటిన మొక్కల మనుగడపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు వాటి సంరక్షణ, నిర్వహణకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
