
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో ఊహకు కూడా అందని స్థాయిలో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అత్యున్నత స్థాయి ఉద్యోగాల నియామకాల్లో నిబంధనలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులు, నిరుద్యోగులు తదితర అనర్హులతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారని తెలిపారు. శాసనసభలో నిబంధన 344 కింద నిర్వహించిన ప్రత్యేక చర్చలో గ్రూప్–1 పరీక్షల వ్యవహారాన్ని సీఎం ప్రస్తావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పాటైన ఏపీపీఎస్సీ రాష్ట్రానికి కీలకమైన అధికారులను ఎంపిక చేసే సంస్థ అని, దాని విశ్వసనీయతను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.
కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు
2018లో జారీ చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్‌కు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 325 మందిని షార్ట్‌లిస్ట్ చేశారని చంద్రబాబు తెలిపారు. ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించుకునే పరీక్షల నిర్వహణలో నిబంధనలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ కోర్టును తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేశారని అన్నారు. కోర్టు ఆదేశాల తర్వాత కూడా హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం కోసం రూ.1.19 కోట్ల విలువైన పనులకు ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. మరోవైపు ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపి విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిందని సీఎం తెలిపారు.
అనర్హులతో జవాబు పత్రాల మూల్యాంకనం
గ్రూప్–1 వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాల పరీక్షా పత్రాలను అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో దిద్దించారని చంద్రబాబు ఆరోపించారు. ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు, గృహిణులు, నిరుద్యోగులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లతో మూల్యాంకనం చేయించారని పేర్కొన్నారు. మొత్తం 158 మందితో ప్యానల్ ఏర్పాటు చేసి, 72 మందికి మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని తెలిపారు. వారిలో 25 మందిని అనధికారికంగా నియమించారని, మరో 66 మంది అనధికారికంగా పరీక్షా పత్రాలను దిద్దారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తుల ల్యాప్‌టాప్‌లకు మూల్యాంకన వివరాలను పంపడంతో పాటు, పీడీఎఫ్ రూపంలో జవాబు పత్రాలను ప్రైవేటు ఈ-మెయిళ్లు, గూగుల్ డ్రైవ్, వాట్సప్ ద్వారా పంపించారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్ నుంచి జవాబు పత్రాలను అనధికారికంగా తరలించి 84 రోజుల పాటు హాయ్‌లాండ్‌లో ఉంచారని చెప్పారు.
డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు
కొత్త చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాన్యువల్ మూల్యాంకనానికి ఆదేశాలు ఇచ్చారని సీఎం తెలిపారు. 49 వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు ముద్రించినట్లు వెల్లడించారు. జవాబు పత్రాల్లో వేర్వేరు రాతలు, మార్పులు, చేర్పులు, ఓవర్ రైటింగ్‌లు గుర్తించామని చెప్పారు. 734 ఓఎంఆర్ స్లిప్పుల్లో 718 స్లిప్పుల్లో మార్పులు జరిగినట్లు తెలిపారు. 21 స్లిప్పులపై ఎలాంటి సంతకాలు లేకపోవడం అక్రమాల తీవ్రతకు నిదర్శనమన్నారు. గ్రూప్–1 పరీక్ష రాసిన ఒక అభ్యర్థినే అదే పరీక్షకు ఎవాల్యుయేషన్ ఎగ్జామినర్‌గా నియమించడం మరింత దారుణమని చంద్రబాబు అన్నారు. ఎగ్జామినర్ల జాబితాలను వాట్సప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టారని తెలిపారు. మూల్యాంకనం జరిగిన హాల్లో 17 రోజుల పాటు సీసీ కెమెరాలు లేకపోవడం, మొబైల్ ఫోన్లను అనుమతించడం వంటి ఉల్లంఘనలు జరిగాయని ఆరోపించారు. ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్పుల్లో వైటనర్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు వెల్లడించాయని తెలిపారు.
శిక్ష పడుతుందనే భయం ఉండాలి
2019–24 మధ్య రాష్ట్రంలో వ్యవస్థలను ధ్వంసం చేశారని చంద్రబాబు విమర్శించారు. వ్యక్తుల కోసం వ్యవస్థలు ఉండవని, యువత భవిష్యత్తు కోసమే వ్యవస్థలు పనిచేయాలని అన్నారు. తప్పు చేస్తే కఠినంగా శిక్ష పడుతుందనే భయం ఉండాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని, ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలను పూర్తిగా విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పారదర్శకమైన మూల్యాంకన విధానం, పటిష్టమైన భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకుని సంస్కరణలు చేపడతామని తెలిపారు.
