
ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజే) నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ లీసా గిల్‌ను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారత రాజ్యాంగం కల్పించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ జస్టిస్ లీసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2023 జూలై 24న ఏపీ సీజేగా నియమితులైన ఆయన అదే ఏడాది జూలై 28న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2026 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. న్యాయస్థానాల సమర్థవంతమైన నిర్వహణ కోసం సీజే పదవి ఖాళీ అవ్వడానికి రెండు నెలల ముందే సంబంధిత న్యాయమూర్తిని ఆ కోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫారసు మేరకు ఈ ప్రక్రియ సాగుతోంది.
జస్టిస్ లీసా గిల్ విద్యాభ్యాసం చండీగఢ్‌లోనే సాగింది. స్థానిక కార్మెల్ కన్వెంట్ స్కూల్లో ప్రాథమిక విద్యను, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ గర్ల్స్ (సెక్టార్-11)లో డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పట్టాలను అందుకున్నారు. 1990లో అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, పంజాబ్-హర్యానా హైకోర్టులో క్రిమినల్, సివిల్, సర్వీస్ రాజ్యాంగ పరమైన కేసుల్లో అపార అనుభవం గడించారు.
చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు పలు ప్రభుత్వ సంస్థల తరపున కీలక కేసులు వాదించిన ఆమెను 2014 మార్చి 31న పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతులు కల్పించారు. సుదీర్ఘ కాలంగా న్యాయవ్యవస్థలో విశేష సేవలు అందిస్తున్న జస్టిస్ లీసా గిల్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం కానుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
