Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఏపీ లిక్కర్ స్కాం…వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు

ఏపీ లిక్కర్ స్కాం…వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు

Panthagani Anusha
19 జనవరి, 2026

రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కేసు అత్యంత కీలక దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కోణంలో విచారణను ముమ్మరం చేసిన ఈడీ, ఈ కేసులో ప్రధాన పాత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా అగ్రనేతలు, ఎంపీలు విజయసాయిరెడ్డి, పీవీ మిధున్‌రెడ్డిలకు సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది.

మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలాలు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విజయసాయిరెడ్డిని జనవరి 22న, మిధున్‌రెడ్డిని జనవరి 23న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది.

దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన నూతన మద్యం విధానమే ఈ భారీ కుంభకోణానికి మూలంగా మారింది. మద్యం విక్రయాలను ప్రైవేట్ లైసెన్సుదారుల నుంచి తప్పించి ప్రభుత్వ సంస్థ ఏపీఎస్‌బీసీఎల్ పరిధిలోకి తీసుకురావడం వెనుక పక్కా వ్యూహం ఉందని సిట్ చార్జిషీట్లలో పేర్కొంది.

బ్రాండ్ల ఎంపికలో వివక్ష, గుర్తు తెలియని మద్యం బ్రాండ్లకు ప్రాధాన్యం, ధరల పెంపు వంటి చర్యలతో మద్యం కంపెనీల నుంచి భారీగా అక్రమ వసూళ్లు జరిగాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. 2019 జూలై 29న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలోనే ఈ అక్రమాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సిట్ గుర్తించింది.

మరోవైపు ఎంపిక చేసిన కొద్ది బ్రాండ్లకే అనుమతులు ఇస్తూ మద్యం తయారీ సంస్థల నుంచి ప్రతి నెలా సగటున రూ.50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేశారని, తమ ఐదేళ్ల పాలన కాలంలో ఈ మొత్తం రూ.3,500 కోట్లకు చేరిందని అంచనా వేస్తున్నారు.

ఆఫీస్ బాయ్స్ ఖాతాల ద్వారా మనీలాండరింగ్

వసూలైన లంచాల సొమ్మును నేరుగా చేతులు మార్చకుండా అత్యంత వ్యవస్థబద్ధంగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు తమ సొంత బ్యాంకు ఖాతాలను ఉపయోగించకుండా ఆఫీస్ బాయ్స్, డ్రైవర్లు, తక్కువ స్థాయి ఉద్యోగుల ఖాతాల ద్వారా నిధులను మళ్లించినట్లు సిట్ గుర్తించింది.

జీతాలు, భత్యాలు లేదా ఇతర ఖర్చుల పేరుతో డబ్బును ఈ ఖాతాల్లోకి జమ చేసి అక్కడి నుంచి ఇతర నిందితులకు, వారి అనుచరులకు తరలించినట్లు బ్యాంక్ లావాదేవీల ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ లావాదేవీలన్నీ ఇప్పుడు ఈడీ చేతికి చిక్కినట్లు సమాచారం. వసూలైన సొమ్ములో సింహభాగం వైకాపా అగ్రనేతలకు చేరిందన్న ఆరోపణలు కేసుకు మరింత బలం చేకూర్చుతున్నాయి.

అయితే అప్పటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ, ఏపీఎస్‌బీసీఎల్‌లో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి కార్యాలయానికి పలుమార్లు లేఖలు రాసి హెచ్చరించినప్పటికీ నాటి ప్రభుత్వం వాటిని ఏమాత్రం పట్టించుకోలేదని దర్యాప్తులో తేలింది.

అదేవిదంగా అర్హతలు లేని డి.వాసుదేవ రెడ్డిని ఏపీఎస్‌బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించడంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కీలక పాత్ర పోషించారని సిట్ చార్జిషీట్లు స్పష్టం చేస్తున్నాయి. జగన్‌ను లంచాల లబ్ధిదారుడిగా సిట్ పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు ఆయనను నిందితుడిగా చేర్చలేదు.

ప్రభుత్వ మార్పుతో తెరపైకి ఫైళ్లు

2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మద్యం విధానానికి సంబంధించిన ఫైళ్లు, ఆర్థిక లావాదేవీలు, బ్రాండ్ల ఎంపిక ప్రక్రియను కొత్త ప్రభుత్వం పునఃపరిశీలనకు తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు స్పష్టమై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు.

కాగా సిట్ దర్యాప్తులో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలతో పీవీ మిధున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం కేసును మరింత వేడెక్కించింది. అనంతరం దాఖలైన చార్జిషీట్ల ఆధారంగా మనీలాండరింగ్ నేరాలున్నాయని భావించిన ఈడీ కేసును స్వీకరించింది. మరోవైపు మిధున్‌రెడ్డి బెయిల్‌పై ఉండగా తాజాగా ఈడీ రంగంలోకి రావడం రాజకీయ ప్రకంపనలకు దారితీసింది.

వైకాపా ఆరోపణలు

మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని వైకాపా తీవ్రంగా ఖండించింది ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కుట్రేనని, కూటమి ప్రభుత్వం కేంద్ర సంస్థలను వాడుకుని తమపై బురదజల్లుతోందని మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సహా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఏపీ లిక్కర్ స్కాం…వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు - Tholi Paluku