Let's talk: editor@tmv.in
ఏపీ టెక్ భవిష్యత్తుకు బాటలు.. క్వాంటమ్-ఏఐ రంగంలో 7 కీలక ఒప్పందాలు

ఏపీ టెక్ భవిష్యత్తుకు బాటలు.. క్వాంటమ్-ఏఐ రంగంలో 7 కీలక ఒప్పందాలు

Panthagani Anusha
21 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో 'క్వాంటం వ్యాలీ'గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్' వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ ఒప్పందాలు రాష్ట్రంలో ఏఐ, క్వాంటం సాంకేతిక పరిజ్ఞానాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌లో జాతీయ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

అమరావతి కేంద్రంగా అద్భుత ఆవిష్కరణలు

రాష్ట్రంలో ఏఐ, క్వాంటం సాంకేతికతను ప్రభుత్వ శాఖల్లో భాగం చేసి పౌర సేవలను మరింత సరళతరం చేయడమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కంప్యూటింగ్ సెంటర్ తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా అమరావతిలో ఏఐ-క్వాంటం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఈ ఏడాది చివరి నాటికి ఏర్పాటు చేయనున్నారు. ఇది ఏఐ-క్వాంటం డిజిటల్ ఎంబసీగా పనిచేయనుంది. మరోవైపు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో ఒప్పందం ద్వారా దక్షిణ భారతదేశంలోనే మొదటి ఏఐ క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీని రాష్ట్రంలో స్థాపించనున్నారు. దీనికి కేంద్రం నిధులు సమకూర్చనుండగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని, క్వాంటం హార్డ్‌వేర్‌ను అందిస్తుంది.

నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట: లక్షలాది మందికి శిక్షణ

రాష్ట్రంలోని యువతకు భవిష్యత్తు సాంకేతికతలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం దిగ్గజ సంస్థలతో చేతులు కలిపింది. ఐబీఎం తో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని లక్ష మంది యువతకు క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అదేవిధంగా వైజర్ సంస్థతో ఒప్పందం ద్వారా ఈ ఏడాది ముగిసేలోపు 3.5 లక్షల మందికి 2027 నాటికి 6 లక్షల మందికి ఏఐ-క్వాంటం శిక్షణ అందించాలని నిర్ణయించారు. దీనితో పాటు ఐఐటీ మద్రాస్‌తో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 'ఏఐ ట్యూటర్'ను ప్రవేశపెట్టేందుకు శ్రీకారం చుట్టారు.

సాంకేతిక మౌలిక వసతుల బలోపేతం

రాష్ట్రంలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ అకాడమీలు, ఏఐ శాండ్‌బాక్స్‌లను ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు, ఫ్యాకల్టీ అభివృద్ధి, మరియు ఏఐ ఆధారిత కరికులం అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా, భారత్ జెన్మరియు నెక్స్ట్‌జెన్ ఐబీఎం తో కలిసి స్టేట్-లెవల్ ఏఐ టెక్ హబ్‌ను నిర్మించనున్నారు. ఇది 22 భారతీయ భాషలకు మద్దతునిచ్చే ఐదు పొరల స్వదేశీ ఏఐ స్టాక్‌ను రూపొందిస్తుంది. ఈ కార్యక్రమాల్లో ఐబీఎం, యూనిక్, నీలిట్, ఐఐటీ మద్రాస్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఏపీ టెక్ భవిష్యత్తుకు బాటలు.. క్వాంటమ్-ఏఐ రంగంలో 7 కీలక ఒప్పందాలు - Tholi Paluku