
ఏపీ ఆర్టీజీఎస్‌ను సందర్శించిన రాజస్థాన్ ఐటీ బృందం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) పనితీరును అధ్యయనం చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించింది.
రాజ్‌కాంప్ ఇన్ఫో సర్వీసెస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ లక్ష్మీకాంత్ కటార, బ్రహ్మగుప్త సెంటర్ ఆఫ్ ఫ్రంటియర్ టెక్నాలజీస్ నోడల్ అధికారి రమేష్ దవాండ్, డిప్యూటీ డైరెక్టర్ నితీష్ కుమార్ జంగడిల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందానికి ఆర్టీజీఎస్ సీఈఓ ప్రకర్ జైన్ స్వాగతం పలికారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీజీఎస్ కార్యకలాపాలు, డేటా ఆధారిత పాలన విధానం, ఆధునిక సాంకేతిక వినియోగంపై సమగ్రంగా వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని 40 శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సమీకరించి భారీ డేటాలేక్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఈ డేటాను విశ్లేషించి పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పలు వినియోగ నమూనాలను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించే అవకాశం కలిగిందన్నారు.
ఆర్టీజీఎస్‌లోని సీసీటీవీ360 వ్యవస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల పర్యవేక్షణలో పోలీసు శాఖకు సాంకేతిక సహకారం అందిస్తున్నామని వివరించారు. అలాగే అవేర్ విభాగం ద్వారా వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించి ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఆగ్రో అడ్వైజరీ సేవలు అందించడంతో పాటు రాష్ట్రంలోని జలాశయాల నీటి నిల్వలు, వర్షపాతం, నీటి లభ్యతను రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్టీజీఎస్ పనితీరు అత్యంత సమర్థవంతంగా ఉందని, డేటా ఆధారిత పాలనలో ఇతర రాష్ట్రాలకు ఇది ఆదర్శంగా నిలుస్తోందని రాజస్థాన్ ఐటీ అధికారుల బృందం ప్రశంసించింది. ఈ కార్యక్రమంలో ఆర్టీజీఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి. శ్రీకర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
