Let's talk: editor@tmv.in
ఏడాదిలోగా మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీ భవనాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్

ఏడాదిలోగా మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీ భవనాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేసి ఏడాదిలోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.

కోఠిలోని తెలంగాణ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) కార్యాలయంలో గురువారం మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, హాస్టల్ భవనాల నిర్మాణ పురోగతితో పాటు మెదక్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌తో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, టీజీఎంఎస్‌ఐడీసీ అధికారులు, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

సుమారు రూ.156 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న మెదక్ మెడికల్ కాలేజీ, హాస్టల్స్, నర్సింగ్ కాలేజీ భవనాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం కాలేజీలు, హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నందున విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి, డీఎంఈని మంత్రి ఆదేశించారు. మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీలు, హాస్టల్ భవనాలను డీఎంఈ వెంటనే సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. అవసరమైతే అన్ని సౌకర్యాలు కలిగిన ప్రత్యామ్నాయ భవనాలను అద్దెకు తీసుకుని హాస్టళ్లను అక్కడికి తరలించాలని ఆదేశించారు. ప్రస్తుతం పాత భవనంలో కొనసాగుతున్న మెదక్ జనరల్ హాస్పిటల్‌కు త్వరలోనే కొత్త భవనాలను మంజూరు చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

ఇదిలా ఉండగా, సుమారు రూ.40 కోట్లతో నిర్మించిన సంగారెడ్డి నర్సింగ్ కాలేజీ భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉందని టీజీఎంఎస్‌ఐడీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. భవనం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

ఏడాదిలోగా మెదక్ మెడికల్, నర్సింగ్ కాలేజీ భవనాలు పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ - Tholi Paluku