Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఏఐ హబ్‌గా ఏపీ… దావోస్‌లో చంద్రబాబు కీలక సమావేశాలు

ఏఐ హబ్‌గా ఏపీ… దావోస్‌లో చంద్రబాబు కీలక సమావేశాలు

Panthagani Anusha
19 జనవరి, 2026

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ సాంకేతిక చిత్రపటంపై అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్విట్జర్లాండ్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 56వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సోమవారం జ్యూరిచ్ చేరుకున్న ఆయన తొలిరోజే వరుస భేటీలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా ఈరోస్ ఇన్నోవేషన్స్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా, కో-ప్రెసిడెంట్లు రిధిమా లుల్లా, స్వనీత్ సింగ్‌లతో భేటీ అయి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రాజెక్టుల అమలుపై కీలక చర్చలు జరిపారు.

రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన జెన్‌ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు. ఏఐ ఆధారిత ఫిల్మ్ సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు, కంటెంట్ సూపర్ యాప్, ఏఐ క్రియేటివ్ టెక్ హబ్ ఏర్పాటు వంటి వినూత్న ప్రతిపాదనలపై చర్చించారు. పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ‘డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360’ పేరుతో వర్చువల్ రియాలిటీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ ఏఐ రంగంలో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చడమే మా సంకల్పం. దీని ద్వారా యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా చంద్రబాబు నాయుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరైన తొలి అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత చరిత్ర సృష్టించారని చంద్రబాబు ప్రశంసించారు. అనంతరం సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ శణ్ముగరత్నం, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.

‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ (సంవాద స్ఫూర్తి) అనే థీమ్ తో జరుగుతున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 130 దేశాల ప్రతినిధుల ముందు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల అవకాశాలను చంద్రబాబు వివరించనున్నారు. కాగా నేటి నుంచి జనవరి 23 వరకు దావోస్‌లో జరగనున్న ఈ సదస్సులో చంరబాబు పర్యటన రాష్ట్రానికి కీలక పెట్టుబడులను తీసుకువస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక సమావేశాల అనంతరం స్విట్జర్లాండ్‌లోని తెలుగు ప్రవాసుల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఏపీలో సాంకేతిక విప్లవాన్ని మళ్లీ పరుగులు పెట్టించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏఐ హబ్‌గా ఏపీ… దావోస్‌లో చంద్రబాబు కీలక సమావేశాలు - Tholi Paluku