

ఎస్‌ఐఆర్‌లో అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: మంత్రి వివేక్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ప్రతి కొత్త ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) బాధ్యతగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సూచించారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని తన నివాసంలో మందమర్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలతో సమావేశమైన ఆయన.. ఓటరు నమోదు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదుకు మరో వారం గడువు మాత్రమే ఉన్నందున పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అర్హులైన వారందరికీ జాబితాలో చోటు కల్పించాలని కోరారు. వంద శాతం ఓటరు నమోదుకు కృషి చేసిన బీఎల్‌ఏలను ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీని కలిపిస్తానని హామీ ఇచ్చారు.
పార్టీలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో విభేదాలకు తావివ్వకుండా ప్రోటోకాల్ పాటించాలని, కార్యకర్తలంతా ఐక్యంగా ఉంటూ పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలని మంత్రి సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలంతా తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. తాను కూడా వ్యక్తిగతంగా నీటిని పొదుపు చేస్తూ, విద్యుత్‌ను ఆదా చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలనూ ప్రతిపక్షాలు రాజకీయం చేయడం విడ్డూరమని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ పటిష్ఠంగా ఉన్నాయని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టు కుంగిపోవడానికి నాణ్యతా లోపాలు, అవకతవకలే కారణమని ఆరోపించారు. మేడిగడ్డ పంపులు ఆన్ చేయాలని చెబుతున్న కేటీఆర్.. బ్యారేజ్‌ను ఎందుకు నిర్మించారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి ఉంటే తాగునీరు, నీటి సమస్యలు ఎదురయ్యేవి కావన్నారు.
