Let's talk: editor@tmv.in
ఎల్‌‌నినో సవాళ్లకు తెలంగాణ సిద్ధం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి తుమ్మల

ఎల్‌‌నినో సవాళ్లకు తెలంగాణ సిద్ధం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి తుమ్మల

Gaddamidi Naveen
14 జులై, 2026

వానాకాలం–2026 సీజన్‌లో ఎల్‌‌నినో ప్రభావం వల్ల తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మూడు దశల కంటింజెన్సీ (ముందస్తు) ప్రణాళికలను అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ లో భారత వాతావరణ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐఎంఆర్, క్రిడా వంటి ప్రముఖ సంస్థల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధరంగ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. విత్తనాల కొరత రాకుండా ఇప్పటికే 16.30 లక్షల క్వింటాళ్ల నుంచి అవసరాన్ని బట్టి 12.70 లక్షల క్వింటాళ్ల వరకు విత్తనాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

ఎల్‌‌నినోను శాస్త్రీయంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో 'డైనమిక్ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ రెస్పాన్స్స‌ (డీఎస్ఆర్) విధానాన్ని అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి వారం మండలాల వారీగా సమగ్ర 'వ్యవసాయ-వాతావరణ బులెటిన్' విడుదల చేయనున్నారు. ఈ బులెటిన్ ద్వారా వర్షపాతం, భూగర్భ జలాల లభ్యత, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితి, రైతులు చేపట్టాల్సిన జాగ్రత్తలను సామాజిక మాధ్యమాలు, రైతు వేదికల ద్వారా రైతులకు చేరవేయనున్నారు.

రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వర్షపాతం పరిస్థితులను రోజువారీగా సమీక్షించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, 20 జిల్లాల్లో లోటు ఉన్నట్లు తెలిపారు. వర్షాభావ జిల్లాల్లో కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కలిసి పరిస్థితులను విశ్లేషించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రైతులకు శాస్త్రవేత్తల సూచనలు

వరి రైతులకు ప్రత్యేకంగా శాస్త్రవేత్తలు సూచనలు జారీ చేశారు. నారు పీకే ముందు కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ వినియోగించడం, దగ్గరగా నాటడం, అదనపు నత్రజని ఎరువులు వినియోగించడం, నీటి పొదుపు కోసం ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ) విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ (డీడీఎస్‌ఆర్) పద్ధతిని అనుసరించాలని చెప్పారు. కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పప్పుధాన్యాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు.

ప్రభుత్వం అండగా ఉంటుంది

'రైతు నేస్తం' కార్యక్రమం ద్వారా ఎల్‌‌నినోపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎల్‌‌నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి వ్యవసాయ యాజమాన్య పద్ధతిని క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, వాటిని అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaElNinoTummalaNageswaraRaoFarmersAgricultureTelanganaFarmersRainfallWeatherUpdateCropManagementRythuNesthamFarmingIndia
ఎల్‌‌నినో సవాళ్లకు తెలంగాణ సిద్ధం.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి తుమ్మల - Tholi Paluku