

ఎయిడ్స్ నియంత్రణపై హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ
రాష్ట్రంలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ వంటి వ్యాధులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, వాటి నియంత్రణే లక్ష్యంగా హైదరాబాద్‌లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో సుమారు 1,500 మంది పాల్గొని హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, అవగాహన కల్పించడం అందరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కొత్తగా ఎవరూ హెచ్‌ఐవీ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులకు అవసరమైన వైద్య సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. హెచ్‌ఐవీ సోకిన తల్లుల నుంచి పుట్టబోయే పిల్లలకు వైరస్ వ్యాపించకుండా ఆపేందుకు ఆధునిక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు 12 నుంచి రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బీ పాజిటివ్ – స్టాప్ హెచ్‌ఐవీ పాజిటివ్ అనే ప్రధాన నినాదంతో తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 1.56 లక్షల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నట్లు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఏసీఓ) తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
