Let's talk: editor@tmv.in
ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు
ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు

Yellarthi Chennabasava
11 ఆగస్టు, 2026

ఎఫ్‌సీవీ (ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ) పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభం నుంచి వారిని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో రైతులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, అధికారులు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే రేపటి నుంచి పొగాకు కొనుగోళ్లు జరగాలని కంపెనీలకు స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. బ్రైట్ గ్రేడ్‌కు కిలోకు కనీసం రూ.230, మీడియం గ్రేడ్‌కు రూ.190, ఆఫ్‌స్టైల్‌కు రూ.130, లో గ్రేడ్‌కు రూ.110 చొప్పున ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ధరలను పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పొగాకు రైతులకు ఆర్థిక భరోసాగా ప్రతి అర్హత కలిగిన రైతుకు రూ.50 వేల చొప్పున రెండేళ్లపాటు వడ్డీలేని రుణం అందించేందుకు కేంద్రం అంగీకరించిందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. అనుమతితో సాగు చేసిన రైతులతో పాటు అనుమతి లేని సాగుదారులు, కౌలు రైతులు సహా అర్హులైన వారికి ఈ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అదేవిధంగా ఆఫ్‌స్టైల్, లో గ్రేడ్ పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం ప్రకటించింది. 94 మిలియన్ కేజీలకు క్వింటాల్‌కు రూ.1,000 చొప్పున, అంటే కిలోకు రూ.10 అదనపు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. విక్రయాల అనంతరం రైతుల వివరాలను గుర్తించి ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.

ప్రస్తుత సంక్షోభానికి అధిక ఉత్పత్తి కూడా కారణమని మంత్రి పేర్కొన్నారు. పొగాకు బోర్డు 140 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతించగా, రైతులు సుమారు 240 మిలియన్ కేజీల వరకు ఉత్పత్తి చేశారని తెలిపారు.

భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వచ్చే సీజన్‌లో 80 మిలియన్ కేజీలకు మించి అదనపు సాగుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. విత్తనాల సరఫరా దశ నుంచే నియంత్రణ తీసుకొచ్చి మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా సాగును పరిమితం చేస్తామని చెప్పారు.

ఎఫ్‌సీవీ పొగాకు రైతులను ఆదుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, పొగాకు బోర్డు సమన్వయంతో రైతులకు సాధ్యమైనంత మేలు చేసే చర్యలు కొనసాగుతాయని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు అండగా ప్రభుత్వం: మంత్రి అచ్చెన్నాయుడు - Tholi Paluku