Let's talk: editor@tmv.in
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల కోతలు ఎత్తివేయాలి: కవిత

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల కోతలు ఎత్తివేయాలి: కవిత

Gaddamidi Naveen
19 అక్టోబర్, 2026

జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల వేతనాలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 1195 తీసుకురావడం అన్యాయమని తెలంగాణ రక్షణ సేన అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం సరికాదని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జేఏసీ నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పనిచేస్తున్నారని కవిత తెలిపారు. వీరిలో కొందరి వేతనాలను నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు తగ్గించారని ఆరోపించారు. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణం అధికమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాలను తగ్గించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకవైపు కొందరి వేతనాలు పెంచి, మరోవైపు మరికొందరి జీతాల్లో కోతలు విధించడం ఉద్యోగుల పట్ల వివక్ష చూపడమేనని మండిపడ్డారు.

ఉద్యోగుల వేతనాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వారికి సకాలంలో జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల విషయంలో ఏటా ఐదు శాతం పెంపు ఉండాలనే కేంద్ర నిబంధనలు ఉన్నాయని పేర్కొంటూ, జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించడం ఏమిటని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి, ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించాలని కోరారు. వేతనాల కోతల సమస్యను పరిశీలించి ఉద్యోగులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రిని ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేయడం లేదని కవిత ఆరోపించారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశారని, కాంగ్రెస్‌ పాలనలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌ కూడా ఈ జాబితాలో ఉందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచడంతోపాటు క్రమబద్ధీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఉద్యోగుల వేతనాలు పెంచి, అందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌తోపాటు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాత్ర కీలకమని కవిత అన్నారు. వారు ఒక్కరోజు విధులకు దూరమైనా గ్రామీణ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వేతనాల కోతలపై నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వకపోవడం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోగులకు మద్దతుగా పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వేతనాల కోతలు ఎత్తివేయాలి: కవిత - Tholi Paluku