Let's talk: editor@tmv.in
ఎన్‌సీసీఎఫ్‌ ఎండీతో మంత్రి నాదెండ్ల మనోహర్‌ భేటీ

ఎన్‌సీసీఎఫ్‌ ఎండీతో మంత్రి నాదెండ్ల మనోహర్‌ భేటీ

Pinjari Chand
8 సెప్టెంబర్, 2026

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా, ధరల నియంత్రణ, వినియోగదారులకు సరుకులు సులభంగా అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కేంద్ర అధికారులతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్‌ కోఆపరేటివ్‌ కన్స్యూమర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌సీసీఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌తో మంత్రి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల సరఫరా తీరు, మార్కెట్‌లో ధరల పరిస్థితి, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు అందుబాటులో ఉంచేందుకు తీసుకోవాల్సిన పటిష్ట చర్యలపై చర్చించారు. ప్రజలందరికీ నాణ్యమైన నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి మనోహర్‌ తెలిపారు. ఈ లక్ష్య సాధనలో కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారాన్ని మరింత విస్తృతం చేసుకుంటూ భవిష్యత్తులో సమర్థవంతంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

కేంద్ర కార్యదర్శితో సమావేశం

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతోనూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారం, సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో నిత్యావసరాల లభ్యత, ధరల నియంత్రణ, వినియోగదారుల సంక్షేమానికి సంబంధించి కేంద్రంతో మరింత సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆకాంక్షించారు.