Let's talk: editor@tmv.in
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే: సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే: సీఎం రేవంత్ రెడ్డి

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధే లక్ష్యంగా పనిచేద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను గురువారం సీఎం ప్రారంభించారు. రూ.620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌తో నగరంలోని కీలక ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్‌టాప్ జీపులో ఫ్లైఓవర్‌పై ప్రయాణించి నిర్మాణాన్ని పరిశీలించారు.

ప్రారంభోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించి, నిర్మాణానికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం నిధులు కేటాయించి ఫ్లైఓవర్‌ను పూర్తి చేసిందన్నారు. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని తాను గతంలోనే చెప్పానని, ఈ ప్రాంతంలోని ప్రతి గల్లీ తనకు తెలుసన్నారు.

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోరిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బాలాలా కళాశాల అభివృద్ధికి రూ.20 కోట్లు కోరగా, రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు కేటాయించిన పనులను ఏడాదిన్నరలో పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదేనన్నారు. విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మద్దతుగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారని సీఎం ప్రశంసించారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా దేశభక్తి విషయంలో అందరం ఒక్కటేనన్నారు.

హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరాలం చెరువులో మూడు కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేస్తామని, మెట్రోలో వచ్చి ప్రజలను ఓట్లు అడుగుతామని అన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, వనస్థలిపురం, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు చర్యలు చేపడతామని చెప్పారు.

హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. హిందూ, ముస్లింలు కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తామని, పేద ముస్లింలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

నగర అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తున్నాయని సీఎం ఆరోపించారు. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. ‘‘మనందరం కలిసికట్టుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం’’ అని సీఎం పిలుపునిచ్చారు.

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత అభివృద్ధే: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku