
ఎన్కౌంటర్ లో పెరిగిన మావోయిస్టుల మృతుల సంఖ్య
బస్తర్ డివిజన్లోని బీజాపూర్-దంతేవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో బుధవారం (డిసెంబర్ 3) సుమారు 12 గంటల పాటు సాగిన భీకర ఎదురుకాల్పుల్లో కనీసం 18 మంది మావోయిస్టులు మరణించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. గురువారం సాయంత్రం వరకు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో 18 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) పీ. సుందర్రాజ్ తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది కాబట్టి మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
మరణించిన ముఖ్య మావోయిస్టు నాయకులు:డివిజనల్ కమిటీ మెంబర్ తో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీ నం. 2 కమాండర్ బిల్లా మౌదియామి, మరొక కంపెనీ కమాండర్ ఉన్నారు. వీరి నుంచి లైట్ మెషిన్ గన్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఏకే-47 రైఫిల్స్,.303 రైఫిల్స్, ఇతర గ్రేడెడ్ ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. వారిలో హెడ్ కానిస్టేబుల్ మోను వడది (డీఆర్జీ బీజాపూర్), కానిస్టేబుల్ డుకారు గొండె, జవాన్ రమేష్ సోధీ ఉన్నారు. గాయపడినవారిలో ఇద్దరు డీఆర్జీ జవాన్లు ఉన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉంది. రాయపూర్‌లో చికిత్స పొందుతున్నారు. డీఆర్జీ బీజాపూర్, దంతేవాడ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా (సీఆర్ఫీఎఫ్ కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) సీఆర్పీఎఫ్ బెటాలియన్ బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా ఐజీ పీ. సుందర్రాజ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల కోరిక మేరకు బస్తర్ డివిజన్లో నక్సలైట్లపై నిరంతర ఆపరేషన్లు జరుగుతున్నాయి. నక్సలైట్ల ఉనికి ఉందన్న నిఘా సమాచారం ఆధారంగా ఈ ఉమ్మడి భద్రతా బృందాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి కాల్పులు మొదలయ్యాయి. బీజాపూర్ పోలీస్ లైన్స్‌లో వీరమరణం పొందిన ముగ్గురు జవాన్లకు గురువారం ఉదయం అంతిమ నివాళులు అర్పించారు. పూర్తి సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికీ విస్తృత కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
