
ఉన్నావో కస్టడీ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు అద్భుతం: యోగిత భయానా
ఉన్నావో కేసులో బాధితురాలి తండ్రి కస్టడీలో మృతి చెందిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్షను సస్పెండ్ చేయడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మహిళా హక్కుల కార్యకర్త యోగిత భయానా స్వాగతించారు. ఈ తీర్పును ఆమె అద్భుతమైన తీర్పుగా అభివర్ణించారు.ఈ నిర్ణయం ద్వారా చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రం మరింత బలపడిందని, అధికారాన్ని, సంపదను కలిగి ఉన్నవారికి కూడా ప్రత్యేక రాయితీలు ఉండవని స్పష్టమైన సందేశం వెళ్లిందని భయానా వ్యాఖ్యానించారు. ఇది సామాన్య ప్రజలకు న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచే తీర్పు అని ఆమె పేర్కొన్నారు. ఉన్నావో బాధితురాలి కుటుంబానికి దగ్గరగా ఉన్న భయానా, బాధితురాలిని, ఆమె కుటుంబం వ్యక్తిగతంగా తనకు బాగా తెలుసునని, పలుమార్లు వారిని కలిసినట్లు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు ఎదుర్కొన్న తీవ్రమైన బాధలు, మానసిక వేదనను ప్రత్యక్షంగా చూశానని ఆమె అన్నారు.
సెంగార్ అభ్యర్థన తిరస్కరణ
సోమవారం ఢిల్లీ హైకోర్టు, ఉన్నావో కస్టడీ మృతి కేసులో సెంగార్ శిక్షను నిలిపివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన సెంగార్ అప్పీల్‌ను ఫిబ్రవరి 3, 2026న సంబంధిత రోస్టర్ బెంచ్ ముందు విచారణకు లిస్ట్ చేసింది. గతంలో డిసెంబర్ 23, 2025న సెంగార్‌కు మైనర్ అత్యాచార కేసులో బెయిల్ లభించింది. అయితే ఆ ఉత్తర్వులను డిసెంబర్ 29, 2025న సుప్రీంకోర్టు నిలిపివేసింది. బాధితురాలి తరఫున వాదించిన న్యాయవాది మెహమూద్ ప్రాచా, సెంగార్‌కు బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి అర్హత లేదని కోర్టులో వాదించారు. బాధితురాలు, ఆమె కుటుంబానికి ఇప్పటికీ ముప్పు కొనసాగుతుందనీ, సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలతో వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. అదే సమయంలో సెంగార్ తరఫున సీనియర్ అడ్వకేట్ మనిష్ వాసిష్ఠ్, అడ్వకేట్ కన్హయ్య సింగాల్తో కలిసి వాదనలు వినిపించారు. సెంగార్ ఈ కేసులో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా జైలులో ఉన్నారని, శిక్షలో ఇంకా సుమారు 11 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. 2018 ఏప్రిల్ 3న జరిగిన సంఘటన సమయంలో సెంగార్ సంఘటన స్థలంలో లేడని కూడా వాదించారు.
కేసు పూర్వపరాలు
ట్రయల్ కోర్టు, సెంగార్ కార్యదర్శి సంతోష్ మిశ్రా ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 61 కింద స్వీకరించిందని, అయితే మిశ్రాను కోర్టు విచారించలేదని సెంగార్ తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాల్లో విభేదాలు ఉన్నాయని కూడా వారు పేర్కొన్నారు.
2018లో తిస్ హజారీ కోర్టులు సెంగార్‌తో పాటు ఇతర నిందితులను దోషులుగా తేల్చాయి. మైనర్ అత్యాచార కేసులో ఆయన ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులు అన్నీ
2018లో ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో జిల్లా మఖీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించినవే.
2017 జూన్ 4న బాధితురాలి మైనర్ కుమార్తెకు ఉద్యోగం ఇస్తామంటూ మోసం చేసి సెంగార్ నివాసానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం 2018 ఏప్రిల్ 3న కోర్టు విచారణ కోసం ఉన్నావోకు వెళ్లిన సమయంలో బాధితురాలి తండ్రిపై దాడి జరిగిందని, ఆ తర్వాత ఆయన్ను అక్రమ ఆయుధాల కేసులో పోలీసులు అరెస్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏప్రిల్ 9, 2018న కస్టడీలో గాయాల కారణంగా మృతి చెందారు. శిక్షను సస్పెండ్ చేయడాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు, ఆరోపణల తీవ్రత, సంఘటనల క్రమం, చట్టపాలనపై ఈ కేసు చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
