
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. దశాబ్దాల కల సాకారం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరుకోవడం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల సాకారమైన క్షణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించడంపై ఆయన గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర భూములను తాకడం రాష్ట్రానికి స్వర్ణయుగానికి నాంది అని పేర్కొన్నారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి ప్రాజెక్టులు ఒకదాని తర్వాత ఒకటి సాకారం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఒకప్పుడు అసాధ్యమనుకున్న అనేక భారీ ప్రాజెక్టులు నేడు కళ్లముందే కార్యరూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఈ భాగీరథ ప్రయత్నంలో అన్నీ తానై నిలచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
లక్షలాది ఎకరాలకు సాగునీరు - తాగునీటి సదుపాయం
గోదావరి జలాల రాకపై ఉత్తరాంధ్ర రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎడమ కాలువ ద్వారా విడుదలైన నీటితో తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 9.23 లక్షల మందికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. తాండవ, వరాహ, శారద నదులతో పాటు ఏలేరు కాలువపై సైఫన్లు, ఆక్విడక్టులను నిర్మించారు. ఎడమ కాలువ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.4,192 కోట్లు ఖర్చు చేసింది. అనకాపల్లి సమీపంలోని ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను గోదావరి జలాలతో నింపాలని జలవనరుల శాఖ నిర్ణయించింది.
జలాల రాకతో పుష్కర ఆయకట్టు పరిధిలోని 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు పరిధిలోని 80 వేల ఎకరాలు, పంపా పరిధిలోని 12 వేల ఎకరాలు, తాండవ, వరాహ, మామిడిగెడ్డ ఆయకట్లలోని 46,620 ఎకరాలకు సాగునీటి భరోసా లభించనుంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పారిశ్రామిక, తాగునీరు, సాగునీటి అవసరాల కోసం మొత్తం 23.44 టీఎంసీల నీటిని మళ్లించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
