Let's talk: editor@tmv.in
ఈనెల 17న పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం

ఈనెల 17న పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని ఈనెల 17న నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రజా పాలనా దినోత్సవాన్ని పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 17న ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకుంటారని చెప్పారు. అమరవీరుల స్థూపం వద్ద, పబ్లిక్ గార్డెన్‌లో కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టాలని సూచించారు.

నగరంలోని పలు ప్రధాన భవనాలు, చారిత్రక కట్టడాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి ఈనెల 15న పూర్తి స్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు.

ప్రజా పాలనా దినోత్సవానికి సుమారు వెయ్యి మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు మరో రెండు వేల మంది హాజరుకానున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, వికాస్ రాజ్, అహ్మద్ నదీమ్, ముఖ్య కార్యదర్శులు నవీన్ మిట్టల్, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఆర్టీసీ ఎండీ నాగి రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.