Let's talk: editor@tmv.in
ఇళ్ల పట్టాలు.. క్రమబద్ధీకరణ జాబితా సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

ఇళ్ల పట్టాలు.. క్రమబద్ధీకరణ జాబితా సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి పట్టా అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, పట్టాల క్రమబద్ధీకరణ, గృహ నిర్మాణాలకు నిర్దిష్ట కాలపరిమితి విధించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ అంశాలపై 10 రోజుల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి తనకు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం సమీక్షించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల మందిని ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, వాటి పరిశీలనను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 1,692 గ్రామాల్లో 18 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. అర్హులైన వారికి పట్టాల పంపిణీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఇప్పటికే ఉన్న పట్టాల్లో ఎంతమందిని క్రమబద్ధీకరించాలన్న దానిపై స్పష్టమైన జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.

గృహ నిర్మాణాల పురోగతిపైనా చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకు 5.92 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలిపారు. మరో 5.32 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లన్నింటినీ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అర్హత గుర్తింపు నుంచి పట్టా పంపిణీ, ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి దశకు స్పష్టమైన గడువులు విధించి పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

నాయకత్వంలో కొత్త ఆలోచన.. పాలనలో వేగం

జిల్లా కలెక్టర్లు కొత్త ఆలోచనా విధానంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ‘లీడర్‌షిప్‌–న్యూ ఏజ్‌ గవర్నెన్స్‌’పై సదస్సులో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం నాయకత్వ మార్పు దశలో ఉన్నామని, కొత్త నాయకత్వ విధానంతో పాలనను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాయకత్వం స్వీయ ప్రేరణతో ముడిపడి ఉంటుందని చెప్పారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఫైల్స్‌, డేటా లేక్‌ వంటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఏఐ ద్వారా డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని, తప్పిదాలకు తావులేకుండా ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. టెక్నాలజీ యుగంలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియగా మారిందని, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటేనే వేగంగా ముందుకు వెళ్లగలమని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం తన పనితీరును మార్చుకోవాలని సూచించారు.

మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం అనే భావన పాతదని చంద్రబాబు అన్నారు. బ్యూరోక్రసీ, రాజకీయ నాయకత్వానికి భిన్నమైన నైపుణ్యాలు అవసరమని చెప్పారు. ప్రతి నాయకుడు తన బృందాన్ని ఎంత సమర్థంగా నిర్మించగలడన్నదే ఫలితాలను నిర్ణయిస్తుందన్నారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్నారని, అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలకు వారు నాయకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. మారుతున్న ఉద్యోగ వ్యవస్థలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటు విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కొత్త నాయకత్వ విధానంతో పాలనలో వేగం పెంచి స్వర్ణాంధ్ర విజన్‌ లక్ష్యాలను సాధించాలని సీఎం ఆకాంక్షించారు.

పెట్టుబడుల గ్రౌండింగ్‌కు ప్రాధాన్యం

రాష్ట్రంలో పెట్టుబడులకు ఆమోదం పొందిన పరిశ్రమలను వేగంగా భూమిపైకి తీసుకురావాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదం పొందిన పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రారంభ తేదీలను కూడా ఖరారు చేయాలని సూచించారు. పరిశ్రమల గ్రౌండింగ్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

వచ్చే నవంబరులో 2026 భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో అప్పటికి పరిశ్రమల గ్రౌండింగ్‌పై మరింత స్పష్టత రావాలని సీఎం అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్టోబరులో ప్రాంతీయ కాన్ఫరెన్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు 20 రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాల్లో 359 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. వీటి ద్వారా రూ.13.85 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.6 లక్షల ఉద్యోగాల అవకాశాలు ఏర్పడనున్నాయని వివరించారు. ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే 160 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, రూ.4.03 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.9 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

ఎంఎస్ఎంఈలకు ఊతం

రాష్ట్రంలో ప్రస్తుతం 23.85 లక్షల ఎంఎస్ఎంఈలు తయారీ, సేవలు, వాణిజ్య రంగాల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 175 ఎంఎస్ఎంఈ పార్కులకు గాను 138 పార్కులకు ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. 22 పార్కులు ప్రారంభం కాగా, మరో 116 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా రూ.2,036 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 31,163 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు.

జీఎస్డీపీ వృద్ధిపై దృష్టి

జిల్లాల స్థాయిలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని సంపద సృష్టించాలని చంద్రబాబు సూచించారు. జీఎస్డీపీ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి జిల్లాలోని అవకాశాలను గుర్తించి ‘అన్‌లాక్‌’ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక వనరులకు మార్కెటింగ్‌ కల్పించి ఆర్థిక కార్యకలాపాలను పెంచాలని చెప్పారు.

కేంద్ర గణాంకశాఖ 2022–23 ఆర్థిక సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా నిర్దేశించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ధరల ప్రకారం 2026–27లో రాష్ట్ర వృద్ధిరేటు అంచనా 13.44 శాతంగా నమోదైందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ వృద్ధిరేటు 2026–27 తొలి త్రైమాసికంలో 14.19 శాతానికి పెరిగిందని తెలిపారు. పరిశ్రమల రంగంలో 14.81 శాతం, సేవల రంగంలో 12.70 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు.

ఆక్వా రంగంలో 6.61 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో 31.77 శాతం వృద్ధి నమోదైందని అధికారులు తెలిపారు. విద్యుత్‌ ఉత్పత్తి 24,248 మిలియన్‌ యూనిట్ల నుంచి 28,664 మిలియన్‌ యూనిట్లకు పెరిగిందని, వినియోగం 14.28 శాతం పెరిగిందని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో తొలి త్రైమాసికంలో రూ.1,13,638 కోట్ల జీవీఏ నమోదైందని, సేవల రంగంలో రూ.1,60,107 కోట్ల జీవీఏ నమోదైనట్లు తెలిపారు. జీఎస్టీ ఆదాయంలోనూ 18 శాతం వృద్ధి నమోదైందన్నారు.

మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హెలిపాడ్లను నోటిఫై చేసి వాటిని పర్యాటక రంగంతో అనుసంధానించాలని చంద్రబాబు సూచించారు. జిల్లా కేంద్రాల్లో నైట్‌ ల్యాండింగ్‌ సదుపాయం కలిగిన హెలిపాడ్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

ఆర్టీజీఎస్‌ ద్వారా జిల్లా మంత్రులు, కలెక్టర్లకు జిల్లాల వారీ వృద్ధి సమాచారం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏఐ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని పేర్కొంటూ, సాంకేతికతను పాలనలో మరింత విస్తృతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడంతో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు జిల్లా యంత్రాంగం కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.

ఇళ్ల పట్టాలు.. క్రమబద్ధీకరణ జాబితా సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు - Tholi Paluku