
ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ చొరవ చూపాలి: ఎంపీ అసదుద్దీన్
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా జరిపిన సైనిక దాడులను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ యుద్ధాన్ని ఆపడంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ, పశ్చిమ ఆసియాలో నెలకొన్న అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణాన్ని ఓవైసీ అనైతికం, చట్టవిరుద్ధం, మానవత్వానికి విరుద్ధమైన చర్యగా పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర నెలలో ఈ దాడులు జరగడం మరింత బాధాకరమని ఆయన అన్నారు. శాంతి చర్చలు పురోగమిస్తున్న సమయంలోనే ఈ దాడులు జరగడం అంతర్జాతీయ రాజకీయాల్లో ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఇది వెంటనే ఆగాలి. యుద్ధం విస్తరించినట్లయితే పశ్చిమాసియా మొత్తం అస్థిరతలోకి జారిపోతుంది. దాని ప్రభావం భారత్‌పైనా తీవ్రంగా పడుతుందని ఓవైసీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాంతంలో సుమారు ఒక కోటి మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారని, వారి భద్రత అత్యంత ప్రాధాన్యంగా చూడాలని సూచించారు. యుద్ధం పేరిగితే అక్కడి ఉద్యోగాలు, వలస కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశముందని పేర్కొన్నారు.
ఇంధన ధరల పెరుగుదలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముడి చమురు ధర ఒక్క డాలరు పెరిగినా భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత భారంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.
విమాన సర్వీసులు రద్దు కావడంతో మక్కా, మదీనా వెళ్లిన ఉమ్రా యాత్రికులు సహా వందలాది భారతీయులు వివిధ దేశాల్లో చిక్కుకుపోయారని ఆయన వెల్లడించారు. దుబాయ్, సౌదీ అరేబియా, ఒమాన్ తదితర దేశాల్లో ఉన్న భారతీయులకు తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చర్యలను ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. ఇరాన్లో ప్రభుత్వ మార్పు సాధించాలనే ఉద్దేశంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇరాన్ ప్రజలు గత 35 ఏళ్లుగా ఆంక్షల మధ్య జీవిస్తున్నారని, బయటి శక్తులు కోరుకున్నట్లు అక్కడి రాజకీయ వ్యవస్థ మారదని ఆయన అభిప్రాయపడ్డారు. 2003లో ఇరాక్‌పై జరిగిన దాడిని గుర్తుచేస్తూ, అప్పుడు చూపించిన కారణాలు తర్వాత అసత్యమని తేలిన విషయాన్ని ఓవైసీ ప్రస్తావించారు. లిబియా, సిరియా, సూడాన్ వంటి దేశాల్లో యుద్ధాల వల్ల ఏర్పడిన అశాంతి పరిస్థితులు ప్రపంచానికి హెచ్చరికగా నిలిచాయని చెప్పారు. అదే మార్గాన్ని ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అనుసరించడం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసిన తీరు, అలాగే పాకిస్థాన్ అఫ్గానిస్తాన్ విషయంలో ప్రవర్తించిన విధానాన్ని పోలుస్తూ, తమ పరిసర ప్రాంతాల్లో అస్థిరత సృష్టించే శక్తులుగా ఈ దేశాలను అభివర్ణించారు. ఆక్రమణ, ప్రేరేపణలతో సమస్యలు పరిష్కారం కావు. సంభాషణే మార్గం అని ఆయన అన్నారు.
ప్రధాని మోదీకి విన్నపం
ప్రధానమంత్రి మోదీకి అంతర్జాతీయ వేదికలపై ఉన్న ప్రభావాన్ని ఉపయోగించి, యుద్ధాన్ని నిలిపివేయడానికి మధ్యవర్తిత్వం చేయాలని ఓవైసీ పిలుపునిచ్చారు. భారత్‌కు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలతో వేర్వేరు సంబంధాలు ఉన్నాయని, ఆ అనుభవాన్ని శాంతి దౌత్యంగా మార్చాల్సిన సమయం ఇదేనని చెప్పారు.
యుద్ధం వల్ల సాధారణ ప్రజలే ఎక్కువగా నష్టపోతారు. పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మానవత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ స్థిరత్వం, భారతీయుల భద్రత, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరించాలని ఆయన కోరారు.
