Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఢిల్లీలో షియా ముస్లింల నిరసనలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఢిల్లీలో షియా ముస్లింల నిరసనలు

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై దేశ రాజధాని ఢిల్లీలోని జోర్ బాగ్ ప్రాంతంలో షియా ముస్లిం సమాజానికి చెందిన పలువురు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పోస్టర్లను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిరసనలు చోటుచేసుకోవడం గమనార్హం. నిరసనలో పాల్గొన్నవారు ఖమేనీ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అమెరికా–ఇజ్రాయెల్ చర్యలను ఖండించారు.

ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ భూభాగంపై నిర్వహించిన సైనిక దాడిలో అయతొల్లా అలీ ఖమేనీతో పాటు మరికొంతమంది కీలక నాయకులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. దానికి ప్రతిగా ఇరాన్ పలు అరబ్ దేశాల వైపు డ్రోన్లు, క్షిపణులతో దాడులు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఘర్షణ ఏడో రోజుకు చేరుకోగా, అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో కూడా ఖమేనీ మరణంపై నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీనగర్‌లో షియా ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి ఖమేనీకి నివాళులు అర్పించారు. అలాగే బండిపోరా, రాంబన్ ప్రాంతాల్లో కూడా నిరసనలు జరిగాయి. రాంబన్‌లో నిరసనకారులు “తుమ్ కిత్నే హుస్సేనీ మారోగే… హర్ ఘర్ సే హుస్సేనీ నికలేగా” అనే నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బొమ్మను కూడా దహనం చేశారు. బండిపోరాలో నిరసనకారులు ఖమేనీ చిత్రాలతో ర్యాలీలు నిర్వహించి ఆయన మరణంపై తీవ్ర దుఃఖం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో ఖమేనీ మరణంపై సంతాప సమావేశం నిర్వహించారు. ఆయనకు గౌరవ సూచకంగా రాయబార కార్యాలయంపై జెండాను అర్ధనమ్రంగా ఎగురవేశారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించి అయతొల్లా ఖమేనీకి నివాళులు అర్పించారు. “కండోలెన్స్ బుక్”లో సంతకాలు చేసి ఇరాన్ ప్రజలకు తమ మద్దతును తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఇరాన్ వైస్ కాన్సుల్ మొహ్సిన్ మొఘద్దమీ మాట్లాడుతూ, ఖమేనీకి నివాళులు అర్పించేందుకు భారతీయుల కోసం ప్రత్యేకంగా కండోలెన్స్ బుక్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇరాన్ ప్రజలతో ఐక్యతను వ్యక్తం చేస్తూ పలువురు భారతీయులు వచ్చి సంతకాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. పశ్చిమ ఆసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఆందోళనగా గమనిస్తున్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఢిల్లీలో షియా ముస్లింల నిరసనలు - Tholi Paluku