Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి

Pinjari Chand
1 మార్చి, 2026

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచడంతో పాటు, ప్రాంతీయ అస్థిరత పెరిగే ప్రమాదాలు నెలకొని ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్, అధికారిక వార్తాసంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఎజెన్సీ ఆదివారం తెల్లవారుజామున ఖమేనీ (86) మృతి చెందినట్టు ధృవీకరించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆయన మరణాన్ని గంటల ముందే ప్రకటిస్తూ, ఇది ఇరాన్ ప్రజలకు తమ దేశాన్ని ‘తిరిగి స్వాధీనం చేసుకునే’ గొప్ప అవకాశం అని వ్యాఖ్యానించారు. అవసరమైనంత కాలం భారీగా, కచ్చితంగా బాంబుదాడులు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గత ఎనిమిది నెలల్లో ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు కొనసాగుతున్న సమయంలో రెండోసారి సైనిక చర్యకు దిగింది. ఈ దాడులు ఇరాన్ సైనిక, ప్రభుత్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఖమేనీ హత్యతో నాయకత్వ శూన్యత తలెత్తే అవకాశముంది.

శోకసంద్రమైన ఇరాన్

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన నేపథ్యంలో టెహ్రాన్, ఇస్ఫహాన్, మష్హాద్ నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి శోకసంద్రంగా నివాళులు అర్పించారు. ఈ సమాచారం ఇరాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్ కాస్టింగ్ వెల్లడించింది. ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల జాతీయ శోకదినాలను ప్రకటించింది. ప్రజలు అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ పవిత్ర స్థలాల్లో ప్రార్థనలు నిర్వహించారు. జెండాలను సగం అవనతం చేశారు. భద్రతా చర్యలను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా టెహ్రాన్‌లో, కట్టుదిట్టం చేశారు.

నగరాల్లో నిరసనలు, ప్రార్థనలు

మధ్య ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో ఇమాం స్క్వేర్ వద్ద ప్రజలు భారీగా గుమిగూడి దాడులను ఖండించారు. ఈశాన్య ఇరాన్‌లోని మష్హాద్ నగరంలో ఇమాం రెజా షిరెన్ వద్ద ప్రార్థనలు నిర్వహించి అభిమానులు ఖమేనీకి నివాళులు అర్పించారు. ఇరాన్ అధికారిక మీడియా ఖమేనీ మరణాన్ని ‘షహీద్(అమరుడు)’గా చిత్రీకరిస్తూ, దేశ సార్వభౌమాధికార రక్షణ కోసం చేసిన త్యాగంగా పేర్కొంది. ఖమేనీ అధికారిక ఫార్సీ ఖాతా సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఖురాన్ వాక్యాన్ని పోస్ట్ చేసి ఆయన మరణాన్ని ధృవీకరించింది.

ముగిసిన 37 ఏళ్ల అధ్యాయం

1989 నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీ, ఇస్లామిక్ విప్లవ స్థాపకుడు రుహోల్లా ఖమేనీ వారసుడిగా బాధ్యతలు స్వీకరించారు. పాశ్చాత్య దేశాల ప్రభావానికి వ్యతిరేకంగా ఆయన కఠిన వైఖరి ప్రదర్శించి ప్రసిద్ధి పొందారు. ఇప్పుడు దేశ నాయకత్వ మార్పుపై దృష్టి కేంద్రీకృతమైంది. కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ప్రక్రియ యుద్ధ పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఇరాన్ నాయకత్వంపై మతపెద్దల ఆధిపత్యమా, లేక రివల్యూషనరీ గార్డ్ ప్రభావమా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఖమేనీ మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో 37 ఏళ్ల అధ్యాయం ముగిసినట్టయింది. దేశ భవిష్యత్తు దిశపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది.

ప్రాంతీయ ప్రతిస్పందనలు

ఇరాన్ పారామిలిటరీ దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై అత్యంత తీవ్ర ప్రతిదాడి చేపడతామని హెచ్చరించింది.

బాలి విమానాశ్రయంలో ఇరుక్కుపోయిన పర్యాటకులు

ఇండోనేషియాలోని బాలి దీవిలో ఉన్న అంతర్జాతీయ విమానశ్రయం వద్ద మధ్యప్రాచ్య గమ్యస్థానాలకు వెళ్లే పలు విమానాలు రద్దు కావడంతో 1,600 మందికి పైగా పర్యాటకులు ఇరుక్కు పోయారు. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎతిహాద్ విమానాలు ప్రభావితమయ్యాయి.

శాంతికి పిలుపునిచ్చిన ఈజిప్ట్

ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బద్ర్ అబ్దెలత్తీ ప్రాంతంలో సంపూర్ణ కల్లోలం నివారించాలంటే ఉద్రిక్తతలు తగ్గించి, దౌత్య చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. జోర్డాన్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం అక్కడ ఉన్న పౌరులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. జోర్డాన్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు సంచరిస్తున్నట్టు సమాచారం అందిందని తెలిపింది. ఇరాక్‌లో ఉన్న బగ్దాద్‌లోని గ్రీన్ జోన్ వైపు నిరసనకారులు కదలడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. కాల్పుల శబ్దాలు వినిపించాయి.

ఖతార్‌లో గాయాలు

ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇరాన్ దాడుల్లో ఎనిమిది మంది గాయపడ్డారు. మొత్తం గాయపడిన వారి సంఖ్య 16కి చేరింది. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఉన్న ఒక బాలికల పాఠశాలపై దాడిలో మృతుల సంఖ్య 148కు పెరిగిందని ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

అర్జెంటీనా అధ్యక్షుడి స్పందన

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఈ సంయుక్త దాడిని ప్రశంసించారు. 1994లో బ్యూనస్ ఎయిర్స్‌లోని ఏఎంఐఏ యూదుల కమ్యూనిటీ సెంటర్‌పై జరిగిన బాంబు దాడిని ఆయన ప్రస్తావించారు.

చైనా పౌరుల తరలింపు

చైనా ప్రభుత్వం ఇరాన్, ఇజ్రాయెల్‌లలో ఉన్న తన పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించింది. అజర్‌బైజాన్, ఆర్మేనియా, టర్కీ భూ సరిహద్దులు తెరిచి ఉన్నాయని రాయబారి కార్యాలయం తెలిపింది.

ఇరాన్‌లో తాత్కాలిక పాలన

ఖమేనీ మరణంతో ఇరాన్‌లో చట్టబద్ధంగా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఇందులో అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ , న్యాయవ్యవస్థాధిపతి గులామ్‌హొస్సేన్ మొహ్సేని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు ఉంటారు. కొత్త సుప్రీం లీడర్‌ను వీలైనంత త్వరగా ఎన్నుకోవాలని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌కు చట్టం ఆదేశిస్తుంది.

ఇరాన్ సైన్యాధిపతి, రక్షణ మంత్రి హతం

ఇరాన్ రక్షణ మండలి సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ సైన్యాధిపతి, రక్షణ మంత్రి హతమైనట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఆదివారం వెల్లడించింది. సైన్యాధిపతి అబ్దుల్ రహీమ్ మౌసవి, రక్షణ మంత్రి అజిజ్ నాసిర్జాదే ఈ దాడిలో మరణించారని తెలిపింది. ఇదే సమావేశంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ క్రాప్స్ అధిపతి, భద్రతా సలహాదారు అలీ షంఖానీ కూడా మృతి చెందినట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు

సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడిలో హతమైన తర్వాత, ఇరాన్ ఆదివారం ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణి దాడులు ప్రారంభించింది. దీనికి ప్రతిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరింత ఉద్రిక్తత పెంచితే తీవ్ర ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ కేబినెట్ ఈ పెద్ద నేరానికి ప్రతీకారం తప్పదని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ముహ్మద్ బగేర్ ఖలీఫా మీరు మా రెడ్ లైన్ దాటారు, దీని మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.

ఇరాన్ ప్రతిదాడులు

ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్దీ క్షిపణులు ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. వాటిలో చాలా వాటిని అడ్డుకున్నామని పేర్కొంది. టెల్ అవీవ్ ప్రాంతంలో ఒక మహిళ మృతి చెందినట్లు రక్షణ సేవలు తెలిపాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. యుఏఈ రాజధాని అబుదాబిలో శకలాలు పడి ఒకరు మృతి చెందినట్లు అక్కడి మీడియా తెలిపింది. దుబాయ్‌లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ సమీపంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. సౌదీ అరేబియా తన రాజధాని, తూర్పు ప్రాంతాలపై దాడులను తిప్పికొట్టినట్లు తెలిపింది. జోర్డాన్ 49 డ్రోన్లు, క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది.

అంతర్జాతీయ ప్రభావం

హోర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి నెలకొంటే ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2025లో సముద్ర మార్గంగా రవాణా అయిన ప్రపంచ చమురు ఎగుమతుల్లో మూడో వంతు హోర్ముజ్ గుండా వెళ్లింది. అమెరికా సైన్యం తెలిపిన ప్రకారం, రివల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశాయి. వందలాది ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిగినప్పటికీ అమెరికా స్థావరాలకు తక్కువ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు.

ఇరాన్‌లో తాత్కాలిక పాలన

ఖమేనీ మరణంతో ఇరాన్ తాత్కాలిక పాలన కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసింది. కొత్త సుప్రీం లీడర్ ఎంపికయ్యే వరకు ఈ కౌన్సిల్ దేశ పరిపాలనను నిర్వహిస్తుంది.

నిలిచిపోయిన విమానాలు

అమెరికా–ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై చేపట్టిన దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్య దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రపంచవ్యాప్తంగా ఇరుక్కుపోయారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా మధ్య కీలక అనుసంధాన కేంద్రాలైన విమానాశ్రయాలు నేరుగా ప్రభావితమయ్యాయి. ఆదివారం కూడా మధ్యప్రాచ్యంలోని అనేక విమానాశ్రయాలు మూసివేశారు. ఎమిరేట్స్ దుబాయ్‌కు రాకపోకలన్నీ ఆదివారం మధ్యాహ్నం వరకు నిలిపివేసింది. ఖతార్ ఎయిర్​ వేస్ ప్రకారం, ఖతార్ విమానాశ్రయం సోమవారం ఉదయం వరకు మూసివుంచనున్నారు. ఇజ్రాయెల్ గగనతలం కూడా ఆదివారం మూసివేశారు.

ఆగిపోయిన కీలక హబ్‌లు

యుఏఈ ప్రభుత్వం తాత్కాలిక, పాక్షిక గగనతల మూసివేత ప్రకటించిన తరువాత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, అబుదాబిలోని జాయేద్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు , దోహా విమానాశ్రయాలు మూసివేశారు. ప్రధాన ఎయిర్‌లైన్స్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎతిహాద్ — కలిపి రోజుకు సుమారు 90,000 మంది ప్రయాణికులను ఈ హబ్‌ల ద్వారా రవాణా చేస్తుంటాయి. మొత్తం మీద 1,800కుపైగా విమానాలు రద్దయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నలుగురు గాయపడగా, అబుదాబి జాయెద్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడిలో ఒకరు మృతి చెందారు, ఏడుగురు గాయపడ్డారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా అంతరాయం

ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థల ప్రకారం, టెల్ అవీవ్, దుబాయ్ వైపు వెళ్తున్న కనీసం 145 విమానాలు దారి మళ్లించారు. కొన్ని విమానాలు ఎథెన్స్, ఇస్తాంబుల్, రోమ్ వంటి నగరాల్లో దిగాయి. మరికొన్ని తిరిగి బయలుదేరిన సొంత స్థావరాలకే చేరాయి. భారత పౌర విమానయాన సంస్థ మధ్యప్రాచ్య గగనతలాన్ని హై-సెక్యూరిటీ రిస్క్ జోన్‌గా ప్రకటించడంతో ఎయిర్ ఇండియా మధ్యప్రాచ్య గమ్యస్థానాలకు అన్ని విమానాలను రద్దు చేసింది. టర్కీస్ ఎయిర్ లైన్స్ లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్‌కు విమానాలను సోమవారం వరకు నిలిపివేసింది. అమెరికాకు చెందిన డెల్టా, యునైటైడ్ ఎయిర్ లైన్స్ టెల్ అవీవ్‌కు విమానాలను వాయిదా వేశాయి. బ్రిటీష్ ఎయిర్ వేస్ టెల్ అవీవ్, బహ్రెయిన్‌కు విమానాలను వచ్చే వారం వరకు నిలిపివేసింది.

టికెట్ ధరలపై ప్రభావం

మధ్యప్రాచ్యం చుట్టూ దారి మళ్లించాల్సి రావడంతో విమాన ప్రయాణ సమయం పెరుగుతుంది. అదనపు ఇంధన ఖర్చులు ఎయిర్‌లైన్స్ భరించాల్సి రావడంతో టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రయాణికులకు సూచనలు

ఎయిర్‌లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయాలని సూచిస్తున్నాయి. అనేక ఎయిర్‌లైన్స్ రీబుకింగ్ ఫీజులు మాఫీ చేశాయి. విమానయాన విశ్లేషకుడు హెన్రీ హార్టేవెల్ట్ ప్రకారం ఈ పరిస్థితిలో ప్రయాణికులు కొన్ని రోజులు చాలా మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటివరకు ఇంటి నుంచి బయలుదేరని వారు త్వరలో ప్రయాణించే అవకాశం తక్కువ అని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు కొనసాగితే విమాన సర్వీసుల పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో స్పష్టత లేదు. 2025 జూన్‌లో జరిగిన ఇజ్రాయెల్–అమెరికా దాడులు 12 రోజులు కొనసాగినట్లు గుర్తుచేస్తున్నారు.

ఖమేనీ మృతితో కర్ణాటక గ్రామంలో విషాద వాతావరణం

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతితో కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా అలిపుర గ్రామం విషాదంలో మునిగిపోయింది. బెంగళూరుకు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ షియా ప్రాబల్యం గల గ్రామంలో ఆదివారం గంభీర వాతావరణం నెలకొంది. సుమారు 30 వేల జనాభాలో మెజారిటీ షియాలే. ఖమేనీ మరణ వార్త ఆ ఊరి ప్రజలకు తీవ్ర షాక్‌కు గురిచేసింది.

గ్రామంలో ఆయన పేరుతో ఒక ఆసుపత్రి కూడా ఉంది. 1986లో ఖమేనీ అలిపురను సందర్శించిన తర్వాత గ్రామంతో ఇరాన్‌కు బలమైన అనుబంధం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. అనేక కుటుంబాలకు ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని, కొంతమంది అక్కడే విద్య, ఉద్యోగాల కోసం స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఖమేనీ మరణంపై మూడు రోజుల సంతాపాన్ని గ్రామస్థులు ప్రకటించారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయగా, అన్ని వేడుకలు, ప్రజా కార్యక్రమాలు నిలిపివేశారు. ఆదివారం షియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఖమేనీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. శోక సూచకంగా నల్ల దుస్తులు ధరించి, నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఖమేనీ ఫొటోలను చేతబట్టి నినాదాలు చేస్తూ ఆయన హత్యను ఖండించారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి - Tholi Paluku