Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ

Shaik Mohammad Shaffee
9 మార్చి, 2026

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న తరుణంలో ఇరాన్ తన తదుపరి గమ్యాన్ని నిర్దేశించుకుంది. ఇరాన్ అత్యున్నత నేత (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ ఇటీవల జరిగిన వైమానిక దాడిలో మరణించడంతో, ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ (56)ని వారసుడిగా ఎంపిక చేస్తూ ఇరాన్ నిపుణుల మండలి (అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్) సోమవారం అధికారిక ప్రకటన చేసింది. గత దశాబ్ద కాలంగా తెర వెనుక ఉండి ఇరాన్ రాజకీయాలను శాసించిన మోజ్తబా, ఇప్పుడు నేరుగా అధికార పీఠంపై కూర్చున్నారు.

మోజ్తబా ఖమేనీ నేపథ్యం

మోజ్తబా ఖమేనీ ప్రస్థానం మొదటి నుంచీ వివాదాలు, వ్యూహాలతో ముడిపడి ఉంది. ఆయన నేపథ్యం పరిశీలిస్తే.. 1969లో పవిత్ర నగరమైన మషాద్‌లో జన్మించారు. తండ్రి అలీ ఖమేనీ ఇరాన్ విప్లవంలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలోనే మోజ్తబా పెరిగారు. యవ్వనంలో ఉండగానే 1980వ దశకంలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో స్వయంగా పాల్గొన్నారు. ఇది ఆయనకు సైనిక వర్గాల్లో మంచి పట్టును తెచ్చిపెట్టింది.

ఇరాన్ ఆధ్యాత్మిక కేంద్రమైన కోమ్‌ నగరంలో సంప్రదాయ మత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఆయన హోదా ‘హుజ్జతుల్ ఇస్లాం’. ఇది సుప్రీం లీడర్ పదవికి ఉండాల్సిన ‘అయతొల్లా’ స్థాయి కంటే తక్కువైనప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా ఆయనకే మొగ్గు లభించింది.

బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించకపోయినా, ఇరాన్ రాజకీయాలను వెనక ఉండి నడిపించడంలో మోజ్తబా దిట్ట అని పేరుంది. 2005లో అహ్మదీ నెజాద్ ఇరాన్ అధ్యక్షుడిగా గెలవడంలోనూ, ఆ తర్వాత 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన పెద్ద ఎత్తున నిరసనలను సైన్యం సాయంతో అణచివేయడంలోనూ మోజ్తబానే కీలక పాత్ర పోషించారని విశ్లేషకులు చెబుతుంటారు. తండ్రికి నీడలా ఉంటూ సైన్యంపై, పాలనపై పట్టు పెంచుకున్న ఆయన, ఇప్పుడు దేశానికి పూర్తిస్థాయిలో సర్వాధికారిగా మారారు.

ఐఆర్జీసీతో బలమైన సంబంధాలు

మోజ్తబాకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ)తో ఉన్న అనుబంధమే ఆయనను ఈ స్థానంలో కూర్చోబెట్టింది. తండ్రి కార్యాలయంలో పని చేస్తూ, ఎవరూ ఖమేనీని కలవాలన్నా మోజ్తబా అనుమతి తప్పనిసరి అనే స్థాయికి ఎదిగారు. ఐఆర్జీసీలోని క్వాడ్స్ ఫోర్స్, బాసిజ్ మిలీషియా బలగాలపై ఆయనకు పూర్తి నియంత్రణ ఉంది. ముఖ్యంగా అతివాద భావాలు కలిగిన యువత ఆయనను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. సైన్యం పర్యవేక్షణలో ఉండే భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఆయనే పర్యవేక్షిస్తుంటారని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు పుతిన్ శుభాకాంక్షలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికైన మొజ్తబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌లతో యుద్ధం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో ఇరాన్‌కు రష్యా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ముదురుతున్న యుద్ధం

ఒకవైపు రాజకీయ మార్పులు జరుగుతుంటే, మరోవైపు యుద్ధం బీభత్సం సృష్టిస్తోంది. మోజ్తబా నియామకాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, తమ మద్దతు లేని నాయకుడు ఎక్కువ కాలం పదవిలో ఉండలేరని హెచ్చరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎనిమిది దేశాల్లో ఉన్న తమ దౌత్య కార్యాలయాల సిబ్బందిని అమెరికా వెనక్కి పిలిపించింది.

విషతుల్యమైన గాలి.. అపార ప్రాణ నష్టం

ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల టెహ్రాన్‌లోని చమురు నిల్వలు తగలబడిపోయి, నగరం మొత్తం దట్టమైన నల్లటి పొగతో నిండిపోయింది. దీనివల్ల గాలి విషపూరితంగా మారిందని, యాసిడ్ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని సహాయక సంస్థలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,230 మంది, లెబనాన్‌లో 397 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10,000 ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి భవనాలు నేలమట్టమయ్యాయి.

వివాదాల ‘వారసత్వం’

రాచరికాన్ని వ్యతిరేకించి పుట్టిన ఇరాన్ విప్లవంలో మళ్లీ ఒకే కుటుంబానికి అధికారం కట్టబెట్టడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. 2022లో జరిగిన హిజాబ్ నిరసనల సమయంలో కూడా మోజ్తబాను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సవాళ్లను అధిగమించి మోజ్తబా ఇరాన్‌ను ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ - Tholi Paluku