
ఇద్దరు ఐపీఎస్‌లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాపై సస్పెన్షన్ ఎత్తివేత
సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండేళ్ల సస్పెన్షన్ అనంతరం వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైకి చెందిన నటి, మోడల్ కాదంబరి నరేంద్ర కుమార్ జెత్వానీని వేధించిన ఆరోపణలపై 2024 సెప్టెంబర్ 15న వీరిద్దరినీ ప్రభుత్వం మొదట సస్పెండ్ చేసింది. ఆ తర్వాత అనేకసార్లు ఈ సస్పెన్షన్‌ను పొడిగించింది.
వీరి సస్పెన్షన్ పొడిగింపు గడువు సెప్టెంబర్ 4తో ముగియనుండగా, ప్రభుత్వం అంతకంటే ముందే తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది. 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా, 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీల సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ జీవోలు జారీ చేశారు. ఆగస్టు 24న సదరు అధికారులు ఇచ్చిన వినతిపత్రం, అదే రోజు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) పంపిన లేఖ ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ రద్దు చేసినప్పటికీ, వారిపై కొనసాగుతున్న శాఖాపరమైన, క్రిమినల్ విచారణలపై దీని ప్రభావం ఉండదని సీఎస్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అసలేం జరిగింది?
2024 ఫిబ్రవరి 2న విజయవాడలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ముంబైకి చెందిన కాదంబరి జెత్వానీ, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదైంది. ఈ కేసు వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా నమోదైంది. ఈ మేరకు ఐపీఎస్ అధికారులు పి. సీతారామాంజనేయులు (పీఎస్‌ఆర్), కాంతి రాణా టాటా, విశాల్‌గున్ని చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. రాజకీయ నేతలు ప్రేరేపించడంతో తప్పుడు రికార్డులు సృష్టించి కాదంబరీ జెత్వానీ కుటుంబ సభ్యులపై అక్రమ కేసు బనాయించి వేధించారని సమాచారం. ఈ వ్యవహారంలో విద్యాసాగర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు (పీఎస్‌ఆర్), అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నిలను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉంటూ సస్పెండైన ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు (పీఎస్‌ఆర్) ఆగస్టులో పదవీ విరమణ చేశారు.
