Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇందిరా పార్కులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

ఇందిరా పార్కులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Gaddamidi Naveen
9 మార్చి, 2026

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం ఇందిరా పార్క్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.పార్క్‌లో పారిశుధ్య పరిస్థితులు, మౌలిక సదుపాయాల స్థితిగతులను ఆయన పరిశీలించారు.

తనిఖీ సందర్భంగా పార్క్ ప్రాంగణంలో పేరుకుపోయిన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా పిల్లల ఆటస్థలం ప్రస్తుతం దెబ్బతిన్న స్థితిలో ఉండటాన్ని గమనించి, దానిని తక్షణమే మరమ్మతులు చేసి ఉపయోగానికి అనుకూలంగా మార్చాలని సూచించారు. పార్క్‌ను పరిశుభ్రంగా, సందర్శకులకు అనుకూలంగా నిర్వహించడం అత్యంత అవసరమని కర్ణన్ పేర్కొన్నారు. ప్రజలు ఎక్కువగా వచ్చే ఈ ప్రదేశంలో పారిశుధ్యం, మౌలిక వసతులు మెరుగుపరచాలని, అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆయన సూచించారు. ఇందిరా పార్క్‌లో శుభ్రత, నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేశారు.

నగర అభివృద్ధికి 'కోర్ అర్బన్ యాక్ట్'

ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ పరిపాలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల కార్యకలాపాలకు వర్తించేలా కొత్త కోర్ అర్బన్ యాక్ట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత ప్రస్తుతం అమలులో ఉన్న జీహెచ్ఎంసీ చట్టాన్ని భర్తీ చేయనుంది.

అనుమతులు, ఫీజు నిర్మాణం, అభివృద్ధి పనులన్నీ కోర్ అర్బన్ యాక్ట్ ప్రకారమే అమలు కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ప్రతిష్ఠాత్మక 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అదే సమయంలో నగరంలో పారిశుధ్యం, శుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నియంత్రించేందుకు తగిన చెత్త డంపింగ్ కేంద్రాలను గుర్తించి ఏర్పాటు చేయాలని సూచించారు. వాటి ఏర్పాటు అనంతరం అనధికారికంగా చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఇందిరా పార్కులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ - Tholi Paluku