Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇండోర్‌లో భిక్షాటన చేస్తూ..కోట్ల ఆస్తులకు అధిపతి

ఇండోర్‌లో భిక్షాటన చేస్తూ..కోట్ల ఆస్తులకు అధిపతి

Pinjari Chand
19 జనవరి, 2026

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో భిక్షాటన నిర్మూలన కార్యక్రమం సందర్భంగా అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ, లక్షల రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టాడు. చక్రాలున్న బోర్డుపై తిరుగుతూ భిక్ష అడిగే ఈ వ్యక్తి వద్ద మూడు ఇళ్లు, ఒక కారు, మూడు ఆటోరిక్షాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు నగరంలోని ప్రసిద్ధ సరాఫా (బులియన్) మార్కెట్‌లో వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడని వెల్లడించారు. దీంతో ఈ ఘటన నగరమంతా చర్చనీయాంశంగా మారింది. ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సరాఫా ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న సుమారు 50 ఏళ్ల కుష్టు రోగిని గుర్తించి రక్షించినట్లు మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారి, రాష్ట్ర వాణిజ్య రాజధానిని భిక్షాటన రహిత నగరంగా మార్చే కార్యక్రమానికి నోడల్ అధికారి కూడా అయిన దినేశ్ మిశ్రా తెలిపారు.

మూడు ఇళ్లు

ఈ వ్యక్తి వద్ద మూడు పక్కా ఇళ్లు ఉన్నాయి, అందులో ఒకటి మూడు అంతస్తుల భవనం. అదేవిధంగా మూడు ఆటోరిక్షాలను రోజుకు అద్దెకు ఇస్తున్నాడు. భిక్షాటనకు వెళ్లేందుకు ఒక కారును ఉపయోగిస్తాడు. ఆ కారుకు డ్రైవర్‌ను కూడా నియమించుకున్నాడు. చక్రాలున్న పలకపై తిరుగుతూ భిక్ష అడుగుతుంటాడని మిశ్రా వివరించారు. 2021 నుంచి భిక్షాటన చేస్తున్న ఈ వ్యక్తి, సరాఫా మార్కెట్‌లోని వ్యాపారులకు రూ. 4–5 లక్షలు అప్పుగా ఇచ్చి, రోజుకు రూ. 1,000 నుంచి రూ. 1,200 వరకు వడ్డీ ఆదాయం పొందుతున్నాడని అధికారులు తెలిపారు. అదనంగా, భిక్ష ద్వారా రోజుకు రూ. 400 నుంచి రూ. 500 వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అతడిని ఒక ఆశ్రమంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇండోర్ జిల్లా కలెక్టర్ శివం వర్మ మాట్లాడుతూ ఇండోర్ ఇప్పటికే భిక్షాటన రహిత నగరంగా గుర్తింపు పొందిందని, ప్రజల నుంచి సమాచారం వచ్చినప్పుడు ఇలాంటి పునరావాస కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ వ్యక్తి ఆస్తులపై ప్రాథమిక సమాచారం అందిందని, అన్ని అంశాలు నిర్ధారించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

మానవతా దృక్పథంతో చూడాలి

అయితే భిక్షాటన నిర్మూలన కోసం పనిచేస్తున్న ప్రవేశ్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు రూపాలి జైన్ ఈ ఘటనను మానవతా దృక్పథంతో చూడాలని అన్నారు. ఈ వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తిని భిక్షాటన ద్వారానే సంపాదించాడన్న అభిప్రాయం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అతడు కూలీ (మేస్త్రీ)గా పనిచేశాడని, కానీ కుష్టు వ్యాధి కారణంగా చేతులు, కాళ్లకు తీవ్ర అనారోగ్యం రావడంతో పని చేయలేకపోయాడని జైన్ చెప్పారు. సామాజిక, కుటుంబ వివక్షను ఎదుర్కొంటూ, చివరకు సరాఫా ప్రాంతంలోని ప్రసిద్ధ చాట్ చౌపాటీ వద్ద రాత్రివేళ భిక్షాటన ప్రారంభించాడని వివరించారు. గత నాలుగేళ్లలో రెండుసార్లు మేము అతడిని భిక్షాటన మానేయాలని ఒప్పించాం. కొంతకాలం మానేశాడు, కానీ మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకున్నాడని ఆమె చెప్పారు. కుష్టు వంటి వ్యాధులతో బాధపడేవారిని పునరావాసం చేయడం ఎంత కష్టమో ఇది చూపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. దేశంలో గత పది సంవత్సరాలుగా అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు పొందిన ఇండోర్‌ను పూర్తిగా భిక్షాటన రహితంగా మార్చేందుకు, నగర పాలక సంస్థ భిక్ష అడగడం, భిక్ష ఇవ్వడం, భిక్షాటన చేసే వారితో వస్తువులు కొనుగోలు చేయడం కూడా నిషేధించింది.

ఇండోర్‌లో భిక్షాటన చేస్తూ..కోట్ల ఆస్తులకు అధిపతి - Tholi Paluku