
ఇండోనేషియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న డిజిటల్ వ్యసనం నుంచి చిన్నారులను రక్షించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తూ ఆ దేశ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి మెట్యా హఫీద్ శుక్రవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఆగ్నేయాసియాలోనే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించిన తొలి దేశంగా ఇండోనేషియా నిలవనుంది.
నిషేధిత జాబితాలో దిగ్గజ సంస్థలు
ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం.. పిల్లలకు అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఖాతాలు తెరవడంపై నిషేధం అమల్లోకి రానుంది. ఈ జాబితాలో యూట్యూబ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, త్రెడ్స్, బిగో లైవ్, గేమింగ్ ప్లాట్‌ఫామ్ రోబ్లాక్స్ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 28 నుంచి దశలవారీగా ఈ నిబంధనలను అమలు చేయనున్నారు. అన్ని సోషల్ మీడియా సంస్థలు ఈ నిబంధనలకు కట్టుబడి తమ సాంకేతికతను మార్చుకోవాల్సి ఉంటుంది.
పిల్లల భవిష్యత్తు కోసమే ఈ కఠిన నిర్ణయం
సోషల్ మీడియా వల్ల చిన్నారులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిషేధం విధిస్తున్నట్లు మంత్రి మెట్యా హఫీద్ వివరించారు. "ప్రస్తుతం మన పిల్లలు ఆన్‌లైన్ వేధింపులు, మోసాలు, చెడు వీడియోలు, సోషల్ మీడియాకు బానిసవ్వడం వంటి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. పిల్లల్ని ఆకర్షించే ఈ సోషల్ మీడియా మాయాజాలం నుండి వారిని కాపాడుకోవడం ఒక్క తల్లిదండ్రుల వల్లే కాదు, అందుకే ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకుంది" అని ఆమె తెలిపారు. ఈ కొత్త నిబంధన వల్ల మొదట్లో పిల్లలకు, పెద్దలకు కొంత ఇబ్బందిగా అనిపించినా.. చిన్నారుల భవిష్యత్తు బాగుండాలంటే ఇది తప్పదని ఆమె స్పష్టం చేశారు.
మెటా సంస్థకు గట్టి హెచ్చరిక
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిఘాను ప్రభుత్వం ఇప్పటికే కఠినతరం చేసింది. హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో విఫలమవుతున్న మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్) సంస్థ జకార్తా కార్యాలయంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేశీయ నిబంధనలను పాటించడంలో మెటా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రిత్వ శాఖ తీవ్రస్థాయిలో మండిపడుతూ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ట్రెండ్
సోషల్ మీడియా నియంత్రణ విషయంలో ఆస్ట్రేలియా ఇప్పటికే అడుగులు వేసింది. 2025 డిసెంబర్ నుంచి ఆస్ట్రేలియాలో అమలవుతున్న చట్టాల కారణంగా ఇప్పటికే సుమారు 47 లక్షల మంది పిల్లల ఖాతాలను సోషల్ మీడియా సంస్థలు రద్దు చేశాయి. ఇప్పుడు అదే బాటలో ఇండోనేషియా కూడా పయనిస్తోంది. ఏపీ, కర్ణాటక వంటి భారతీయ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇండోనేషియా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
