Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి

ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి

Pinjari Chand
19 జనవరి, 2026

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2026 టోర్నీలో బలంగా రీటర్న్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో భారత జట్టుకు ఆమె నాయకత్వం వహించనున్నారు. గత వారం బీడబ్ల్యూఎఫ్ టూర్‌లో భాగంగా జరిగిన ఇండియా ఓపెన్ టోర్నీలో వియత్నాం క్రీడాకారిణి న్గుయెన్ తుయ్ లిన్ చేతిలో తొలి రౌండ్‌లోనే పరాజయం పాలవడంతో, సింధు తన ఫామ్‌ను తిరిగి అందుకోవాలని ఉత్సాహంగా ఉన్నారని ఒలంపిక్స్.కామ్ పేర్కొంది. గాయాల నుంచి కోలుకుని తిరిగొచ్చిన సింధు, ఈ సీజన్‌లో మలేషియా ఓపెన్‌లో సెమీఫైనల్‌ వరకు చేరి ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అయితే ఇండియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. ఈ ఓటమితో హెడ్-టు-హెడ్ పోరులో న్గుయెన్ తుయ్ లిన్‌కు సింధుపై 3-2 ఆధిక్యం లభించింది. ఇది వియత్నాం క్రీడాకారిణికి సింధుపై సాధించిన మూడో విజయం. ఆ మ్యాచ్‌లో సింధు 20-22తో తొలి గేమ్‌ను కోల్పోయి, రెండో గేమ్‌ను 21-12తో గెలుచుకున్నారు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో 21-15తో పరాజయం పాలయ్యారు.

ఇది నా రోజు కాదు

ఈ పరాజయం అనంతరం సింధు మాట్లాడుతూ ఇది నా రోజు కాదు. కొన్ని మంచి ర్యాలీలు జరిగాయి. టాప్-లెవల్ టోర్నీల్లో ప్రతి ఒక్కరూ బాగా ఆడతారు. తొలి గేమ్ గెలిచాక రెండో గేమ్‌ను కోల్పోయాను. మూడో గేమ్‌లో స్కోరు 11-10 వద్ద ఉండగా, అక్కడి నుంచి ఆమె 2-3 పాయింట్ల ఆధిక్యం సంపాదించింది. ఇప్పుడు తదుపరి టోర్నీ కోసం తిరిగి సిద్ధమవాల్సిన సమయం వచ్చింది. ఇండోనేషియాలో నేను బాగా ఆడతానని ఆశిస్తున్నాను అని సింధు తెలిపారు. ఇండోనేషియా మాస్టర్స్ 2026 మహిళల సింగిల్స్ ప్రధాన డ్రాలో పీవీ సింధుతో పాటు మాళవిక బన్సోడ్, తన్వీ శర్మ, ఉన్నతి హూడా కూడా పాల్గొననున్నారు.

ప్రపంచ ర్యాంకింగ్‌లో 14వ స్థానంలో ఉన్న భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ కూడా ఈ టోర్నీలో మంచి ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నారు. ఇండియా ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌ వరకు చేరిన లక్ష్య సేన్, ఆ జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియా ఓపెన్ పురుషుల క్వార్టర్‌ఫైనల్‌లో లక్ష్య సేన్ తైవాన్‌కు చెందిన లిన్ చున్-యి చేతిలో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్‌ను గెలిచిన లక్ష్య సేన్, అనంతరం నిలకడ కోల్పోయి 17-21, 21-13, 21-18తో మ్యాచ్‌ను కోల్పోయారు.

ఇండోనేషియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ – భారత జట్టు

పురుషుల సింగిల్స్:

లక్ష్య సేన్, హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, ఆయుష్ షెట్టి, తరుణ్ మన్నెపల్లి, కిరణ్ జార్జ్ (క్వాలిఫయర్)

పురుషుల డబుల్స్:

హరిహరన్ అంసకరుణన్ – రుబన్ కుమార్ రేతినసబాపతి,

పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ – సాయి ప్రతీక్ కె (క్వాలిఫయర్)

మహిళల సింగిల్స్:

పీవీ సింధు, మాళవిక బన్సోడ్, తన్వీ శర్మ, ఉన్నతి హూడా,

అన్మోల్ ఖర్బ్ (క్వాలిఫయర్), తస్నీమ్ మిర్ (క్వాలిఫయర్), ఇషరాణి బరువా (క్వాలిఫయర్)

మహిళల డబుల్స్:

రష్మి గణేష్ – సానియా సికందర్ (క్వాలిఫయర్)

మిక్స్‌డ్ డబుల్స్:

ధృవ్ కపిల – తనీషా క్రాస్టో,

రోహన్ కపూర్ – రుత్విక గడ్డే

ఇండోనేషియా టోర్నీ పై పీవీ సింధు దృష్టి - Tholi Paluku