
ఆహార కల్తీపై ప్రభుత్వం ఉక్కుపాదం.. కఠిన చట్టానికి సీఎం రేవంత్ ఆదేశం
రాష్ట్రంలో ఆహార పదార్థాలు, ఔషధాల కల్తీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాలు వంటివన్నీ కల్తీ అవుతుండటం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ప్రతిపాదిత 'తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం' పై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ఉండిపోతున్నాయని, దీనివల్ల కొన్ని దేశాలు మన ఉత్పత్తుల దిగుమతులను సైతం నిరాకరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. సేంద్రియ ఉత్పత్తుల పేరుతో మార్కెట్‌లో అనేక వస్తువులు విక్రయిస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించే సమర్థమైన వ్యవస్థ ప్రస్తుతం లేదని సీఎం పేర్కొన్నారు. ప్రజలు అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల నాణ్యతపై విశ్వసనీయ ధృవీకరణ అవసరమని అభిప్రాయపడ్డారు.
కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలు చేస్తున్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఆ అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదిక సిద్ధం చేసి, దాని ప్రకారం చట్ట ముసాయిదా రూపొందించాలని ఆదేశించారు. అనంతరం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి విస్తృత చర్చ జరపడంతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించాలని సూచించారు.
క్యూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్
కల్తీలకు సంబంధించిన సమాచారాన్ని సమర్థవంతంగా సేకరించేందుకు విజిల్‌బ్లోయర్ వ్యవస్థతో పాటు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే కల్తీ నిరోధక చర్యల అమలుకు ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అక్కడ అమలు సమయంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సూచించారు.
ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
