
ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలి: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
రాష్ట్రంలో ఆహార కల్తీ రక్కసి కోరలు చాచుతోందని దీనిని ఒక ప్రాణాంతక విపత్తు గా గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
గతంలో మన పెద్దలు ‘ఆహారమే ఔషధం’ అని చెప్పేవారని కానీ దురదృష్టవశాత్తూ నేడు అదే ఆహారం విషంగా మారుతోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లాభార్జనే ధ్యేయంగా బియ్యంలో రాళ్లు కలపడం వంటి అక్రమాలు ఇప్పుడు చివరకు పవిత్రమైన ప్రసాదాల తయారీ వరకు చేరడం కలచివేస్తోందని ఈ కల్తీ వల్ల సామాన్య ప్రజల జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా రాష్ట్రంలో క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమవుతోందని ఆమె పేర్కొన్నారు.
కాగా రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పడిపోవడంపై ఆమె గణాంకాలతో సహా బయట పెడుతూ గతపాలకులపై విమర్శలు గుప్పించారు. 2014–19 మధ్య కాలంలో ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ 100కు 47 పాయింట్లతో దేశంలో 10వ స్థానంలో ఉండేదని అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలను బేఖాతరు చేయడం జీవోలను అమలు చేయకపోవడం వల్ల 2023 నాటికి రాష్ట్రం 22 పాయింట్లతో 28వ స్థానానికి పడిపోయిందని తనిఖీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం వల్లే కల్తీ అదుపు తప్పిందని ఆమె విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకంపై దృష్టి సారించడం హర్షణీయమని పేర్కొన్న ఎమ్మెల్యే.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా సిబ్బంది సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని గుర్తుచేశారు. తనిఖీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యంగా హోటళ్లు, వీధి వ్యాపారుల వద్ద లభించే ఆహారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ,అగ్‌మార్క్ వంటి ప్రమాణాలపై ప్రజలకు అవగాహన ఉన్నప్పటికీ వడ్డించే ఆహార నాణ్యత విషయంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని ఆమె సూచించారు.
కాగా ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ స్పందిస్తూ ప్రభుత్వం ఆహార భద్రత విషయంలో రాజీ పడబోదని హామీ ఇచ్చారు. 2023–24 నుంచి 2026 జనవరి వరకు రాష్ట్రవ్యాప్తంగా 16,730 ఆహార నమూనాలను పరీక్షించగా అందులో 1,407 నమూనాలు నాణ్యత లేనివిగా,తప్పుడు బ్రాండింగ్‌తో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై ఇప్పటికే కోర్టుల్లో ప్రాసిక్యూషన్ నమోదు చేసి భారీ జరిమానాలు విధించడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సభకు వివరించారు.
