
ఆర్మీ నియామకాల్లో తెలంగాణ యువతకు ప్రత్యేక శిక్షణ: సీఎం రేవంత్
భారత ఆర్మీ చేపట్టే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ పలువురు ఆర్మీ ప్రతినిధులతో కలిసి బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఆర్మీ నియామకాల్లో స్థానిక యువతకు భారీగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోని ఆసక్తి ఉన్న, అనువైన జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కోరారు. దేశవ్యాప్తంగా జరిగే వివిధ ఆర్మీ రిక్రూట్మెంట్లకు ముందుగానే తెలంగాణ యువతను సిద్ధం చేసేలా ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సుముఖత వ్యక్తం చేశారు. దీనివల్ల సైన్యంలో చేరాలనుకునే గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు అవసరమైన శిక్షణ పొందేందుకు మరింత అవకాశం లభించనుంది.
దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో ఆర్మీ అందిస్తున్న సేవలను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణలో వరదలు, ఇతర విపత్తుల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస చర్యల్లో ఆర్మీ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. రాష్ట్రంలో విపత్తు పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రత్యేకంగా స్పందించేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానని రాజేష్ పుష్కర్ హామీ ఇచ్చారు.
మరోవైపు కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చారిత్రక హైదరాబాద్కు పూర్వవైభవం తీసుకురావాలనే లక్ష్యంతో చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై లెఫ్టినెంట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. హైదరాబాద్ నగరాన్ని రక్షించేందుకు మూసీ నది ప్రక్షాళన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాస్ రావుతో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
