Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఆర్కిటిక్‌లో ‘నాటో’ యుద్ధ విన్యాసాలు

ఆర్కిటిక్‌లో ‘నాటో’ యుద్ధ విన్యాసాలు

Shaik Mohammad Shaffee
9 మార్చి, 2026

ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు కోసం రష్యా, చైనాలు వేస్తున్న ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసేందుకు నాటో తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 'కోల్డ్ రెస్పాన్స్' పేరుతో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు సోమవారం ఉత్తర ధృవ ప్రాంతంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు సాగే ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికా, డెన్మార్క్ సహా 14 దేశాలకు చెందిన సుమారు 25,000 మంది సైనికులు పాల్గొంటున్నారు. రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న నార్వే, ఫిన్లాండ్ దేశాల్లోని మంచు పర్వతాల మధ్య ఈ కసరత్తులు నిన్నటి నుంచి హోరెత్తుతున్నాయి.

మంచు ఖండంపై ‘యుద్ధం’ ఎందుకు?

ఆర్కిటిక్ ప్రాంతం కేవలం మంచు గడ్డ మాత్రమే కాదు, అది అపారమైన సహజ వనరుల నిలయం. మారుతున్న వాతావరణ పరిస్థితులతో మంచు కరుగుతుండటంతో, ఇక్కడ దాగున్న చమురు, గ్యాస్ నిల్వలను దక్కించుకోవడానికి అగ్రరాజ్యాల మధ్య పోటీ మొదలైంది. ఆర్కిటిక్ తీరంలో రష్యా తన పాత సైనిక స్థావరాలను పునరుద్ధరించడమే కాకుండా, కొత్తగా క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఇది నాటో సభ్య దేశాలైన నార్వే, ఫిన్లాండ్‌లకు ముప్పుగా మారింది. మరోవైపు చైనా కూడా తమను తాము ‘నియర్ ఆర్కిటిక్ స్టేట్’గా ప్రకటించుకుని, ఇక్కడ సరికొత్త వాణిజ్య మార్గాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది.

మరోవైపు గ్రీన్‌లాండ్ ద్వీపం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న మొండివైఖరి మిత్రదేశాల మధ్య వివాదాలకు కారణమైంది. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ దేశం నుంచి కొనేయాలని లేదా తన వశం చేసుకోవాలని ఆయన ఒత్తిడి తెస్తున్నారు. దీనివల్ల మిత్రదేశాల మధ్యే గొడవలు మొదలయ్యాయి. అయితే, ఇలా తమలో తాము కొట్టుకోవడం కంటే, రష్యా-చైనా లాంటి దేశాల నుంచి వచ్చే ముప్పును కలిసికట్టుగా ఎదుర్కోవడమే మేలని నాటో దేశాలు ఈ యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి.

యుద్ధం వస్తే పౌరులు ఏం చేయాలి?

ఈ విన్యాసాల్లో కేవలం తుపాకులు, ట్యాంకులే కాకుండా.. పౌర సమాజం పాత్రపై నాటో దేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నార్వే ప్రభుత్వం ఈ 2026 ఏడాదిని ‘టోటల్ డిఫెన్స్’ (సంపూర్ణ రక్షణ) సంవత్సరంగా ప్రకటించింది. యుద్ధం సంభవించినప్పుడు సామాన్య ప్రజలు, వ్యాపార సంస్థలు సైన్యానికి ఎలా అండగా ఉండాలి, గాయపడిన సైనికులకు పౌర ఆసుపత్రులు ఎలా చికిత్స అందించాలి అనే దానిపై ఈ గురువారం నార్వేలో భారీ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

వెనక్కి తగ్గిన అమెరికా జెట్లు

డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపం విషయంలో వివాదం నడుస్తున్నప్పటికీ, అమెరికా తన 4,000 మంది బలగాలను ఈ విన్యాసాలకు పంపింది. అయితే అనూహ్యంగా విన్యాసాలు మొదలవ్వడానికి ముందే ఒక ఎఫ్-35 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను అమెరికా వెనక్కి పిలిపించడం గమనార్హం. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే ప్రశ్నకు అమెరికా రక్షణ శాఖ సూటిగా సమాధానం ఇవ్వలేదు.

రష్యాకు హెచ్చరిక

రష్యా సరిహద్దులకు అతి సమీపంలో జరుగుతున్న ఈ విన్యాసాల ద్వారా నాటో తన ఐక్యతను చాటుకుంటోంది. ఫిన్లాండ్‌లోని ఊహాజనిత యుద్ధ క్షేత్రం నుండి తరలించే గాయపడిన సైనికులకు నార్వేలోని పౌర ఆసుపత్రులు ఎంత వేగంగా చికిత్స అందిస్తాయనేది ఈ శిక్షణలో కీలక పరీక్ష. ఆర్కిటిక్ ప్రాంతంలోని సహజ వనరులపై కన్నేసిన శత్రు దేశాలకు, నాటో దేశాలన్నీ ఒకే తాటిపై ఉన్నాయన్న సందేశాన్ని ఈ 'కోల్డ్ రెస్పాన్స్' ద్వారా పంపిస్తున్నాయి.

ఆర్కిటిక్‌లో ‘నాటో’ యుద్ధ విన్యాసాలు - Tholi Paluku