Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఆర్ఎస్ఎస్ పై మాట్లాడను:డీకే శివకుమార్

ఆర్ఎస్ఎస్ పై మాట్లాడను:డీకే శివకుమార్

Pinjari Chand
20 అక్టోబర్, 2025

సనాతనవాదులతో సంబంధం పెట్టుకోవద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మౌనం వహించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ విషయం మీద నేను ఏమి మాట్లాడను. నా బాధ్యతలకు సంబంధించిన విషయాలు అడగండి, నేను వివరిస్తాను అని శివకుమార్ చెప్పారు. సీఎం సిద్ధరామయ్య శనివారం ఆర్ఎస్ఎస్ ‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మైసూరు యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా సీఎం మాట్లాడుతూ సనాతనులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. అప్పటిలాగే ఇప్పటికీ వారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

అంబేద్కర్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు

సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో సీఎం ఈ విధంగా పోస్ట్ చేశారు. సమాజ మార్పు కోసం కృషి చేసే వారితో సంబంధాలు పెట్టుకోండి. సమాజ మార్పును వ్యతిరేకించే వారితో లేదా సనాతనవాదులతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు.

బీజేపీ, సంఘ్ పరివార్ అంబేడ్కర్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఓడించిందని చెబుతున్నారు. కానీ ఆయన స్వయంగా అంబేద్కర్ ఓ లేఖలో రాసినట్లు, తనను సావర్కర్, డాంగే ఓడించారని వివరించారు. అలాగే ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయిపై చెప్పు విసిరిన ఘటన సనాతనవాదుల మనస్తత్వానికి నిదర్శనం. అలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని తెలిపారు. నేను బుద్ధుడు, బసవేశ్వరుడు, అంబేడ్కర్ సిద్ధాంతాలపై విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పారు.

రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు ప్రియాంక్ ఖర్గే ప్రభుత్వం ఆధీనంలోని విద్యాసంస్థలు, ఆలయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని ఇటీవల డిమాండ్ చేశారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దీంతో కర్ణాటకలో ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ వివాదానికి తెరలేచింది.

ఆర్ఎస్ఎస్ పై మాట్లాడను:డీకే శివకుమార్ - Tholi Paluku