Let's talk: editor@tmv.in
ఆరుగురి హత్యల కేసు.. పోక్సో నిందితుడి కోసం 12 పోలీసు బృందాల గాలింపు

ఆరుగురి హత్యల కేసు.. పోక్సో నిందితుడి కోసం 12 పోలీసు బృందాల గాలింపు

Gaddamidi Naveen
13 జులై, 2026

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శుక్రవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఆరుగురిని దారుణంగా హత్య చేసిన పోక్సో కేసు నిందితుడు పి.రాజ్‌కుమార్ (35) కోసం తెలంగాణ పోలీసులు గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి 12 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదివారం మీడియాకు తెలిపారు.

సాంకేతిక ఆధారాలు, నిందితుడి స్నేహితులు, బంధువుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా శోధిస్తున్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని కమిషనర్ ధీమా వ్యక్తం చేశారు.

కారు అద్దెకు తీసుకుని.. రైల్వే ట్రాక్ వద్ద వదిలేసి..

హత్యలు చేయడానికి ఒక రోజు ముందే రాజ్‌కుమార్ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు తన భార్య ఫోన్ నుంచి ఆన్‌లైన్ పేమెంట్ చేసి ఒక ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టర్ వద్ద కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ విషయాన్ని పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా విశ్లేషణ ద్వారా గుర్తించారు. అయితే, ప్రయాణంలో కారులో ఇంధనం (ఫ్యూయల్) అయిపోవడంతో, నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌ల సమీపంలో ఆ వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యాడు.

ప్రస్తుతం పోలీసు బృందాలు హైదరాబాద్‌లోని లాడ్జీలు, రోడ్‌సైడ్ ధాబాలు, రైల్వే స్టేషన్లతో పాటు ఏపీలోని శ్రీశైలంలో ఉన్న బంధువుల ఇళ్లలో కూడా గాలిస్తున్నాయి. నిందితుడి ఫోటోలను అన్ని ప్రాంతాలకు పంపారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు.

హత్యలు చేసిన వెంటనే రాజ్‌కుమార్ తన తండ్రికి ఫోన్ చేసి, తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నానని తండ్రితో చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దాంతో కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు తండ్రికి చెప్పిన మాటల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలించారు. కానీ ఎలాంటి మృతదేహం లభించలేదు. ఈ విషయమై గవర్నమెంట్ రైల్వే పోలీస్ ని కూడా అప్రమత్తం చేశారు.

హత్యలకు అసలు కారణం ఏంటి?

ఈ దారుణ సామూహిక హత్యాకాండకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. తన మైనర్ కూతురిని వేధిస్తున్నాడంటూ ఒక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మే నెలలో రాజ్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో అతను ఇటీవలే ముందస్తు బెయిల్ పై బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపడంతో పాటు, తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సదరు బాలిక కుటుంబానికి చెందిన మరో ముగ్గురిని కొడవలి, కత్తితో గొంతుకోసి అత్యంత కిరాతకంగా చంపేశాడు.

రాజ్‌కుమార్ ఆన్‌లైన్ బెట్టింగులు, జూదానికి బానిసయ్యాడని, ఇందుకోసం భారీగా అప్పులు చేసి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి చాలా వరకు అప్పులు తీర్చినప్పటికీ, అప్పుల బాధ తట్టుకోలేక గత ఏడాది అక్టోబర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడని దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు
TelanganaHyderabadRangaReddyShabadCrimeNewsBreakingNewsTelanganaPolicePOCSOCaseMurderCaseCrimeAlertPoliceInvestigationManhuntTelanganaNewsHyderabadNewsLatestNewsTrendingNewsLawAndOrder
ఆరుగురి హత్యల కేసు.. పోక్సో నిందితుడి కోసం 12 పోలీసు బృందాల గాలింపు - Tholi Paluku