
ఆయుష్ వైద్యానికి హబ్‌గా ఏపీ.. రూ.414 కోట్ల అభివృద్ధి ప్రణాళిక: మంత్రి సత్యకుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్‌ను ఆయుష్ వైద్యానికి జాతీయ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఆయుర్వేదం, యునాని, నేచురోపతి, హోమియోపతి వంటి ప్రాచీన వైద్య విధానాలకు పునర్వైభవం తీసుకురావడానికి రూ.414 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన “ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు” రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ విషయాలను వెల్లడించారు. ఆయుష్ విభాగం పరిధిలో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. రోగం వచ్చిన తర్వాత చికిత్స అందించే విధానం నుంచి, రోగాలను ముందుగానే గుర్తించి నివారించే ‘ప్రెడిక్టివ్–ప్రివెంటివ్–వెల్‌నెస్ సెంట్రిక్’ ఆరోగ్య విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.
ఆయుష్ సేవల విస్తరణలో భాగంగా రూ.280 కోట్ల వ్యయంతో నాలుగు కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మవరం, పిఠాపురంలో ఆయుర్వేద కళాశాలలు, ప్రొద్దుటూరులో యునాని కళాశాల, విశాఖపట్నంలో నేచురోపతి మెడికల్ కళాశాల నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. ఒక్కో కళాశాలకు రూ.70 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరం ప్రాంతాల్లో సమగ్ర ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.44 కోట్ల వ్యయంతో 1,500కు పైగా ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మంత్రి పేర్కొన్నారు. త్వరలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి రాష్ట్రాన్ని సందర్శించనున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఔషధ మొక్కల సాగుకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని మంత్రి చెప్పారు. అశ్వగంధ, మునగాకు, ఉసిరి, అలోవెరా వంటి మొక్కలకు అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలు పెరుగుతున్నాయని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసి ఔషధ మొక్కల సాగును మరింత ప్రోత్సహిస్తాయని తెలిపారు.
సదస్సులో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ మాట్లాడుతూ ఔషధ ఉత్పత్తులు శాస్త్రీయ ప్రమాణాలు, నాణ్యతా ధృవీకరణలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కెవియన్ చక్రధర్ బాబు నకిలీ ‘నేచురల్’ ఉత్పత్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఔషధ, సుగంధ మొక్కల ప్రోత్సాహానికి రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించగా, ఆయుర్వేద గ్రంథాలను ఆవిష్కరించి రైతులకు ఔషధ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
