Let's talk: editor@tmv.in
ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి: కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు

ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి: కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు

Gaddamidi Naveen
21 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వాకల్చర్ (చేపలు, రొయ్యల సాగు), పొగాకు రంగాలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజీవ్ రంజన్ సింగ్, పీయూష్ గోయల్‌లకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆయా రంగాల దీర్ఘకాలిక మనుగడను కాపాడటానికి, రైతుల జీవనోపాధిని రక్షించడానికి కేంద్రం నుంచి సకాలంలో విధానపరమైన మద్దతు అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఆక్వాకల్చర్ రంగంలో ఉపయోగించే ఎయిరేటర్లపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి, అలాగే అన్-మాన్యుఫ్యాక్చర్డ్ (ప్రాసెస్ చేయని) పొగాకుపై జీఎస్‌టీని 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రకారం ఆక్వా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు 10 శాతానికి తగ్గినప్పటికీ, టారిఫ్‌లపై నెలకొన్న చట్టపరమైన అనిశ్చితి ఈ రంగాన్ని ప్రభావితం చేస్తోందని ఆయన వివరించారు. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకం కింద రూ. 5 లక్షల వరకు వన్-టైమ్ టాప్-అప్ ఇవ్వాలని, నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎఫ్‌డీబీ) కోసం రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయించాలని కోరారు. విలువ ఆధారిత ఆక్వా ఉత్పత్తులకు సబ్సిడీలు ఇస్తే రొయ్యల ఎగుమతులు బలోపేతం అవుతాయని, పొగాకుపై జీఎస్‌టీ తగ్గిస్తే వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు.

కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు లేఖ

రొయ్యల మేత తయారీ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దేశీయంగా ఉన్న కొరతను అధిగమించడానికి జన్యుమార్పిడి సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతించాలని సీఎం కోరారు. ఈక్వెడార్ దేశం నుంచి రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులు పెరగడం వల్ల అమెరికా, చైనా, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో భారతీయ రొయ్యలకు గట్టి పోటీ ఎదురవుతోందని వివరించారు.

దిగుమతి చేసుకునే జీఎం సోయాబీన్ మీల్‌ను కేవలం మేత కోసమే వాడతామని, దీనిని వ్యవసాయానికి లేదా విత్తనోత్పత్తికి ఉపయోగించరు కాబట్టి జీవవైవిధ్యానికి ఎటువంటి ముప్పు ఉండదని స్పష్టం చేశారు. గతంలో 2021లో కూడా పరిమిత దిగుమతులకు అనుమతి ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో బ్లూ ఎకానమీని ప్రోత్సహించడానికి అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకోసం నెక్కల్లు వద్ద 7.8 ఎకరాల భూమిని కేటాయించామని, కేంద్రం తక్షణమే ఆ భూమిని స్వాధీనం చేసుకుని 2028 నాటికి రీజినల్ ఆఫీస్, ట్రైనింగ్ సెంటర్, ఫిషరీస్ పార్క్, పబ్లిక్ అక్వేరియం పనులను పూర్తి చేయాలని సీఎం కోరారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ

దేశీయ రొయ్యల మేత తయారీదారులను రక్షించడానికి ఫిష్ మీల్ (చేపల పొడి) ఎగుమతులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌‌టీ) ద్వారా నియంత్రించాలని సీఎం కోరారు. ఫిష్ మీల్ ఎగుమతులకు 5 శాతం ప్రోత్సాహకాలు ఉండటం వల్ల దేశీయ తయారీదారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని, కాబట్టి దేశీయ అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

జింబాబ్వే, టాంజానియా వంటి పోటీ దేశాలు తమ పొగాకు ఎగుమతిదారులకు సబ్సిడీలు, సుంకాల మినహాయింపులు ఇస్తున్నాయని, అయితే భారతీయ ఎగుమతిదారులకు అటువంటి మద్దతు లేదన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు ఫ్లూ-క్యూర్‌డ్ వర్జీనియా (ఎఫ్‌‌సీవీ) పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. హెచ్ఎస్ కోడ్స్ 2401, 2401 10, 2401 20, 2401 30 పరిధిలోకి వచ్చే అన్-మాన్యుఫ్యాక్చర్డ్ పొగాకుకు రోడ్‌టెప్ ప్రయోజనాలను విస్తరించాలని, అలాగే ఎఫ్‌సీవీ పొగాకును ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్, నిర్యాత్ ప్రోత్సాహక పథకాల పరిధిలోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.

ట్యాగ్‌లు
ChandrababuNaiduAndhraPradeshAPNewsAquaFarmersAquacultureShrimpExportsTobaccoFarmersGSTKisanCreditCardNFDB
ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి: కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు - Tholi Paluku