
అస్సాంలో యుద్ధవిమాన ప్రమాదం.. ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు మృతి
అస్సాం రాష్ట్రంలోని కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్–30 ఎంఎకెఐ (Su-30MKI) యుద్ధవిమానం కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ విషాద ఘటనపై అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన ఈ వీరుల త్యాగం ఎప్పటికీ గౌరవంగా గుర్తుండిపోతుందని ఆయన పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం జోర్హాట్ ఎయిర్‌బేస్ నుంచి శిక్షణ మిషన్ కోసం బయలుదేరిన ఈ యుద్ధవిమానం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్బి ఆంగ్లాంగ్ జిల్లాలోని బోకాజాన్ ఉపవిభాగంలోని చోకిహోలా ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేశ్ దురాగ్కర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై గౌరవ్ గోగోయ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందిస్తూ, శిక్షణ మిషన్‌లో ఉన్న సు-30ఎంఎకెఐ యుద్ధవిమానం కూలిపోవడం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పైలట్ల ధైర్యం, అంకితభావం ఎల్లప్పుడూ దేశ ప్రజలకు గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు.
ఇక గౌహతిలోని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన విమానం అవశేషాలను శుక్రవారం ఉదయం గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు వైమానిక దళం విచారణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
