
అస్సాం ఆల్ జడ్జెస్ అసోసియేషన్ అధికారిక వెబ్ సైట్ ఆవిష్కరణ
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఆదివారం గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆల్ అస్సాం జడ్జెస్ అసోసియేషన్(ఏఏజేఏ) అధికారిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. గతంలో న్యాయమూర్తుల కోసం ఎటువంటి వెబ్ సైట్ లేనందున ఈరోజు దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘జ్యూడిషియల్ ప్రొఫెషనలిజం, ఇటిక్వెట్టి అండ్ ఎక్స్ పెక్టేషన్ ఫ్రం జ్యూడిషియల్ ఆఫీసర్స్’ అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగా
జస్టిస్ భుయాన్ మాట్లాడుతూ, కొత్త వెబ్‌సైట్ న్యాయమూర్తుల మధ్య సక్రమమైన సమాచార మార్పిడికి, స్నేహపూర్వక బంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకం న్యాయవ్యవస్థపై నిలకడగా ఉండాలంటే న్యాయ నిర్ణయాలు పక్షపాతం లేకుండా, స్వతంత్రంగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.న్యాయవ్యవస్థ ఎప్పుడూ ఎటువంటి అనుకూలతలు చూపుతున్నట్లు కనిపించకూడదని ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తులు తమ వృత్తి జీవితంలో నిష్పాక్షికత, సద్భావనను కాపాడాలని, ఇతర విభాగాల అధికారులతో ఎక్కువ సన్నిహితంగా ఉండకూడదని సూచించారు.
జస్టిస్ భుయాన్ పేర్కొంటూ జిల్లా స్థాయి న్యాయవ్యవస్థ బలంగా ఉన్నప్పుడే దేశ న్యాయవ్యవస్థకు స్థిరత్వం, విశ్వసనీయత లభిస్తుందన్నారు. కష్ట సమయంలో కూడా న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలని, ధైర్యవంతమైన న్యాయమూర్తులు సమాజానికి అవసరమని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశుతోష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం అస్సాం న్యాయవ్యవస్థలో సంప్రదింపులు, వృత్తి నైపుణ్యం, సమన్వయం, న్యాయ స్వతంత్రతను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.