
అసెంబ్లీలో విపక్ష గొంతు నొక్కుతున్నారు: హరీశ్‌రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష గొంతును ప్రభుత్వం అణచివేస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సెక్షన్ 22ఏ అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉన్నప్పటికీ తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆయన అన్నారు.
గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు.. అసెంబ్లీలో ప్రజా సమస్యలు సరిగా చర్చకు రావడం లేదని, ప్రతిపక్షం లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని అడ్డుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
రైతుల సమస్యలపై ఆందోళన
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. యూరియా అందుబాటులో లేకపోవడం, విద్యుత్ సరఫరాలో సమస్యలు, రుణమాఫీ పూర్తిగా జరగకపోవడం వంటి అంశాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. మరోవైపు రైతులకు చెందిన లక్షలాది ప్రైవేటు ఆస్తులను సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. సెక్షన్ 22ఏ అంశంపై బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆందోళనలు నిర్వహిస్తోందని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేయాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విమర్శలు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని కూడా హరీశ్‌రావు ప్రస్తావించారు. బకాయిలు చెల్లించకపోవడంతో సుమారు 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడంతో ఉద్యోగాలు వచ్చినా అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పీజీ కళాశాలలు లేదా విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశాలు వచ్చినా ఆర్థిక సమస్యల కారణంగా విద్యార్థులు వాటిని కోల్పోతున్నారని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.21 వేల కోట్లు కేటాయించామని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు. ఈ అంశంపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మహిళా ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపణ
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ మహిళా ఎమ్మెల్యేలపై దాడులు జరిగినప్పటికీ వారికి మాట్లాడేందుకు కనీసం ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వలేదని హరీశ్‌రావు ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరినా మైక్ ఇవ్వలేదని, కాంగ్రెస్ సభ్యులకు మాత్రం వరుసగా మాట్లాడే అవకాశం కల్పించారని అన్నారు. ఇది ప్రజాస్వామ్య విధానమా? అని ప్రశ్నించారు.
తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేయడం ద్వారా అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడుల అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు. మహిళా పోలీసులను పురుష ఎమ్మెల్యేల చుట్టూ, పురుష పోలీసులను మహిళా ఎమ్మెల్యేల చుట్టూ ఉంచి తమను నియంత్రించేందుకు ప్రయత్నించారని అన్నారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ఘటనలపై సమగ్రంగా విచారణ జరిపిస్తామని చెప్పారు.
దృష్టి మళ్లింపు రాజకీయాలంటూ విమర్శలు
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని హరీశ్‌రావు విమర్శించారు. రైతుల సమస్యలు, నిరుద్యోగం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, సెక్షన్ 22ఏ వంటి అంశాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని ఇతర విషయాలపైకి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తమ గొంతును మాత్రమే కాకుండా ప్రజల గొంతును, ప్రజా సమస్యలను కూడా అణచివేస్తున్నారని అన్నారు.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. వారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన గందరగోళానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్‌ను బీఆర్‌ఎస్ అవమానించిందని ఆరోపించిన వెంకట్.. అందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
