
అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై పోరాడతాం: కేటీఆర్
సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో లేవనెత్తుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. గురువారం మిర్యాలగూడలో జరిగే బహిరంగ సభకు వెళ్తుండగా, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల బృందం ఆయనను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందజేసింది. పాలిటెక్నిక్ కళాశాలల భూములు, విద్యా సంస్థల భవిష్యత్తు, సాంకేతిక విద్య ఎదుర్కొంటున్న సవాళ్లపై విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం వచ్చేలా చూడాలని కోరారు.
ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చి, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు శాసనసభలో పోరాటం కొనసాగిస్తానని కేటీఆర్ వారికి స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలకు ఉన్న విలువైన భూములపైనే ప్రభుత్వ దృష్టి ఉందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జర్మనీలో మాదిరిగా చదువుతో పాటు ప్రాక్టికల్ అనుభవం లభించేలా ‘డ్యూయల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లు’, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టీస్ స్కూళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు మెరుగైన నైపుణ్యాలు అందించే విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి తరఫున బీఆర్ఎస్ అసెంబ్లీలో గళం విప్పుతుందని భరోసా ఇచ్చారు.
