
అవినీతిని సహించను.. అభివృద్ధిలో రాజీ పడొద్దు: ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో రూరల్ మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పంచాయతీలు జాతీయ స్థాయి పురస్కారాలు అందుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఏనాడూ తన వ్యక్తిగత పనుల కోసం ప్రభుత్వ అధికారులను వాడుకోలేదని అధికారుల నుంచి కూడా అదే నిబద్ధతను ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. నేను ఎవరినీ అవినీతి చేయమని ప్రోత్సహించను. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మండలంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైతే తక్షణమే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించారు. ముఖ్యంగా తుమ్మలగుంట పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియం, జిమ్ లీజుకు తీసుకున్న గుత్తేదారులు పన్నులు చెల్లించకపోవడం, వారి విద్యుత్ బకాయిలను పంచాయతీ నిధులతో కట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
మరోవైపు ముంచుకొస్తున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో ఇంకా దొంగ మస్టర్లు రాసే పద్ధతి కొనసాగితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పంచాయతీల్లో ఇంటి పన్నులను విధిగా వసూలు చేయాలని ఆ నిధులను అభివృద్ధి పనులకే ఖర్చు చేయాలని సూచించారు. అదేవిదంగా అధికారులకు పని విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని అందరం కలిసి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పులివర్తి నాని కోరారు.
