
అవార్డులు ఇస్తే చెత్తబుట్టలో వేస్తా.. విశాల్
తెలుగు, తమిళ చిత్రసీమలో ఓ రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్న విశాల్, తన డైనమిక్ యాక్షన్, వినోదాత్మక చిత్రాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. కొంతకాలం విశాల్ కు అనారోగ్యం, ఆ తర్వాత నిశ్చితార్థం, అప్పుడప్పుడు సినిమాల స్టంట్లు కావడం … ఇలా ఏదో ఒక టాపిక్ పై వార్తల్లో నిరంతరం ఉంటారు విశాల్. ఇటీవల “యూవర్స్ ఫ్రాంక్లీ విశాల్” అనే పోడ్కాస్ట్లో అవార్డుల గురించి మాట్లాడుతూ, అవార్డులు కేవలం కమిటీ నిర్ణయాలపై ఆధారపడతాయని, అసలైన గుర్తింపు అభిమానుల ప్రేమ నుంచే వస్తుందని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అలాగే విశాల్ త్వరలో నటి సాయి ధన్సికను వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘పందెం కోడి’తో స్టార్డమ్ సంపాదించాడు. అయితే ఒకే తరహా పాత్రలు చేయడంతో గత కొంతకాలంగా విశాల్ నటించిన సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. 12 ఏళ్ల క్రితం అటకెక్కిన ‘మదగజరాజా’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై హిట్ కావడంతో ఆయన ఉత్సాహం రెట్టింపైంది. 47 ఏళ్ల విశాల్, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ పని చివరి దశకు చేరడంతో, ఆగస్టులో తన పుట్టినరోజు సందర్భంగా సాయి ధన్సికతో నిశ్చితార్థం జరుపుకున్నాడు. వీరి వివాహం వచ్చే ఏడాది జరగనుంది.
ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఓ వీడియో తో మళ్లీ విశాల్ ట్రెండింగ్ లోకి వచ్చారు. ఈ పోడ్కాస్ట్లో విశాల్ స్టంట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను ఎప్పుడూ స్టంట్స్‌లో డూప్‌ను వాడలేదు. నా శరీరంపై 119 గాయాలు నా కష్టానికి నిదర్శనం” అని చెప్పాడు. ఈ నిబద్ధత ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అవార్డులపై మాట్లాడుతూ, ‘ఎనిమిది కోట్ల మంది ఇష్టపడే సినిమాకు అవార్డు ఇవ్వాలా వద్దా అని ఎనిమిది మంది కమిటీ సభ్యులు నిర్ణయించడం సరికాదు. నాకు అవార్డులపై నమ్మకం లేదు, ఎవరైనా ఇస్తే చెత్తబుట్టలో వేస్తా’ అని ఘాటుగా చెప్పాడు. గతంలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కూడా, ‘అభిమానుల ప్రేమే నా నిజమైన అవార్డు’ అని చెప్పి అభిమానులకు తనపై ఉన్న ప్రేమను, అభిమానాన్ని మరింత పెంచారు.