Let's talk: editor@tmv.in
అర్హులైన ప్రతి నిర్వాసితుడికీ పరిహారం: మంత్రి రామానాయుడు

అర్హులైన ప్రతి నిర్వాసితుడికీ పరిహారం: మంత్రి రామానాయుడు

Pinjari Chand
29 ఆగస్టు, 2026

ప్రకాశం ఉమ్మడి జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలన్న మూడు దశాబ్దాల వెలుగొండ కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు, ఆస్తులు, స్వగ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 1996లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని మంత్రి గుర్తుచేశారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 ఆగస్టు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారని తెలిపారు.

రెండేళ్లలో రూ.2,250 కోట్లకు పైగా వ్యయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పనుల కోసం రూ.2,250 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు నిమ్మల రామానాయుడు తెలిపారు. రాత్రింబవళ్లు పనులు కొనసాగిస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే సమయానికి వెలుగొండ హెడ్‌ రెగ్యులేటర్‌కు సంబంధించిన వింగ్స్, వాల్స్ పనులు పూర్తికాలేదని చెప్పారు. 2025 మేలో పనులు ప్రారంభించి 2026 మే నాటికి వాటిని పూర్తి చేసినట్లు వివరించారు. టన్నెల్‌-1లో సుమారు 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగింపు పనులు, టన్నెల్‌-2లో 4,990 మీటర్ల బెంచింగ్‌, 6,990 మీటర్ల లైనింగ్‌ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

ఫీడర్‌ కెనాల్‌కు ప్రత్యేక ప్రాధాన్యం

ప్రాజెక్టులో కీలకమైన 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఫీడర్‌ కెనాల్‌ పనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఈ పనులకు సుమారు రూ.5,460 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఫీడర్ కెనాల్‌లో భాగంగా 5.3 కిలోమీటర్ల పీసీ వాల్‌, 11 కిలోమీటర్ల లైనింగ్‌ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్‌లోని కీలక పనులను దశలవారీగా పూర్తి చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

రికార్డుల్లో లోపాలున్నా పరిహారం

సామాజిక, ఆర్థిక సర్వేలో పేరు లేకపోయినా, గెజిట్‌లో నమోదు కాకపోయినా, కొత్త ఇల్లు ఉన్నా లేకపోయినా, పేర్లలో తేడాలు ఉన్నా నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రికార్డుల్లోని లోపాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హత ఉన్న ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరిహారం అందకుండా మిగిలిన వారితో పాటు, నిబంధనల ప్రకారం అర్హులు కాదని నమోదైనప్పటికీ వాస్తవంగా అర్హులైన వారిని గుర్తించి పరిహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

రూ.169 కోట్ల అదనపు భారం అయినా వెనుకడుగు వేయం

అర్హులైన ప్రతి నిర్వాసితుడికి పరిహారం అందించడం వల్ల ప్రభుత్వంపై సుమారు రూ.169 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతున్నప్పటికీ వెనుకడుగు వేయబోమని మంత్రి తెలిపారు. నిర్వాసితులకు న్యాయం చేయాలన్న మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టుల ద్వారా రైతులు, ప్రజలకు ప్రయోజనం కల్పించడం ఎంత ముఖ్యమో.. వాటి కోసం భూములు, ఆస్తులు, స్వగ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లో వెలుగు నింపడం కూడా అంతే ముఖ్యమన్నారు.

నిర్వాసితుల త్యాగానికి ప్రభుత్వం రుణపడి ఉంది

వెలుగొండ జలాలతో ప్రయోజనం పొందే రైతులు, ప్రజల కంటే ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులు ఒక మెట్టు పైన ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని నిమ్మల రామానాయుడు తెలిపారు. నిర్వాసితులకు ప్రభుత్వం ఎంత చేసినా వారి త్యాగానికి రుణం తీర్చుకోలేమని, వారి పట్ల కృతజ్ఞతతో వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తితో ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీటి భద్రత కల్పించడంతో పాటు.. ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన ప్రతి నిర్వాసిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి నిర్వాసితుడికీ పరిహారం: మంత్రి రామానాయుడు - Tholi Paluku